2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడిన అనేక మంది అమాయకుల్లో జనుపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు. పేరు చెబితే ఎవరబ్బా అని అనుకుంటున్నారు కదా..! అతనే కోడికత్తి శీను. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగినట్టుగా నడిచిన ఒక సుదీర్ఘ నాటకం.. ఈ కోడికత్తి శీను పుణ్యమే. అయితే ఆ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు ఇప్పటికీ యోగం ఉన్నట్టు లేదు. ప్రధానంగా వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోర్టుకు హాజరు కావడం లేదు. ఇవాళ విశాఖలోని ఎన్ఐఏ కోర్టులో జరిగిన విచారణకు బెయిలు మీద ఉన్న నిందితుడు కోడికత్తి శీను, న్యాయవాది సహా హాజరైనప్పటికీ.. వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ మాత్రం రాకపోవడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది.
జగన్మోహన్ రెడ్డి ఈ కోడికత్తి శీనును తన అధికారంకోసం ఒక పావులాగా వాడుకున్నారు. తెలుగుదేశం నాయకులు కుట్ర చేసి తనను హత్య చేయించేందుకు ప్రయత్నించారని నానా గోల చేశారు. రాష్ట్ర పోలీసుల మీద కాదు కదా.. రాష్ట్రంలోర ఉన్న ఆస్పత్రులమీద కూడా నమ్మకం లేదని ప్రకటించి.. గాయం అయిన తర్వాత.. హైదరాబాదు వచ్చేసి ఇక్కడ చికిత్స చేయించుకున్నారు. రాష్ట్రపోలీసుల మీద నమ్మకం లేదంటే.. కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఇందులో కుట్ర కోణం ఏమీ లేదని వారు తేల్చారు. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. అప్పటినుంచి కోడికత్తి శీనుకు కష్టాలు మొదలయ్యాయి. అసలు బాధితుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే చాలు.. నిందితుడు శీనుకు బెయిలు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే తాను ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నానని, కోర్టుకు రావడం కుదరదని చెబుతూ.. జగన్ కాలయాపన చేశారు. జగన్ హాజరు అయి వాంగ్మూలం ఇచ్చి ఉంటే అసలు హత్యాయత్నం కానేకాదని కేసు తేలిపోయి ఉండేదేమో. దానివలన తాను ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుని సీఎంగా అధికారంలోకి వచ్చానని ప్రజలు గుర్తిస్తారనే భయం జగన్ లో ఉండి ఉండవచ్కు. అందుకని ఆయన హాజరుకాలేదు.
తీరా చాలా కాలం జైల్లో మగ్గిన తరువాత శీనుకు బెయిలు లభించింది.
తీరా ఇవాళ విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ ఉండగా.. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. గతంలో అంటే సీఎంగా ఉన్నాను గనుక.. బిజీ అని చెప్పి కోర్టుకు వచ్చేవారు కాదని, ఇప్పుడు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని శీను తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు కూడా. మొత్తానికి కేసు వాయిదా పడింది.
ఇంతకాలం బిజీ అని సాకులు చెప్పి డుమ్మా కొట్టారు. ఇప్పుడు కూడా కోర్టుకు హాజరు కాకపోవడం అనేది జగన్ దుర్బుద్ధి మాత్రమేనని ప్రజలు విమర్శిస్తున్నారు.