నా తమ్ముడు’ అంటూ చిన్నాన్న కొడుకును వెనకేసుకు వస్తూ ఉంటే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అలవిమాలిన అభిమానమో, ప్రేమో అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు ఇస్తున్న క్లారిటీతో జనం కళ్లు తెరచుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి పట్ల జగన్ కు ఉన్నది ప్రేమ కాదు, భయం మాత్రమే అని వారు కూడా నమ్ముతున్నారు.
కడపజిల్లాలో ఏ ప్రొద్దుటూరు వేదికగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారసభలో.. వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబునాయుడుకు ముడిపెట్టడానికి ప్రయత్నించారో అదే ప్రొద్దుటూరు నుంచి వివేకా హత్యను ప్రస్తావిస్తూ జగన్ దుర్బలత్వాన్ని, హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అంటే జగన్ కు ఉన్న భయాన్ని చంద్రబాబునాయుడు ఎండగట్టారు.
ప్రొద్దుటూరులో నాలుగురోజుల కిందట జగన్ మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో ప్రజలందరకూ తెలుసునని చెప్పారు. దస్తగిరిని గుర్తుచేసేలా..హత్యచేసిన వారు బయట హాయిగా తిరుగుతున్నారని, వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అందరికీ తెలుసునని చంద్రబాబుపై నిందలు వేశారు. చెల్లెమ్మలను కూడా తన మీదికి ఎగదోస్తున్నారంటూ.. చంద్రబాబును కుట్రదారుడిగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం చేశారు.
అయితే ఆ మరురోజే వివేకా కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జగన్ మాటలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లూ హంతకులను కాపాడుతూ కూర్చుని.. ఇప్పుడు చిన్నాన్న హత్యను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నావా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన కోణంలోంచి గమనిస్తే.. అవినాష్ రెడ్డిమీద అభిమానంతో కాపాడే ప్రయత్నం కంటె, ఆయన పట్ల భయంతో జగన్ కాపాగడాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్ కీలకరహస్యాలు అన్నీ అవినాష్ చేతుల్లో ఉన్నాయని చంద్రబాబునాయుడు అంటున్నారు. అవినాష్ రెడ్డితో తేడా వస్తే.. వివేకా హత్య కేసులో తాను కూడా ముద్దాయి అవుతాననే భయం జగన్ లో ఉన్నదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఈ మాటలు ప్రజలకు మాత్రం నమ్మశక్యంగానే ఉన్నాయి. ఎందుకంటే.. జగన్ మాటల్లోనే ‘స్వయంగా నేనే చంపాను’ అన్న దస్తగిరి మాటలను నమ్ముతూ చెబుతున్నారు. అదే సమయంలో తనతో ఆ హత్య చేయించింది అవినాష్ రెడ్డే అనే మాటలను మాత్రం జగన్ కొట్టి పారేస్తున్నారు.కుట్ర కింద అభివర్ణిస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కడప జిల్లా వ్యాప్తంగా పార్టీ పరువు తీసేస్తున్నప్పటికీ, ప్రజల్లో జగన్ మీదనే అపనమ్మకం పెరుగుతున్నప్పటికీ.. ఆయన అవినాష్ కు మళ్లీ టికెట్ కేటాయించి తల బలహీనత చాటుకున్నారనే చర్చ నడుస్తోంది. అదే పాయింట్ ను ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు పెడుతున్నారు.