ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. విజయ-శాంతి బంధం నిజమా కాదా అనే చర్చ ఇంకా ప్రజల్లో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో ఆమె భర్త చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టడం లేదు. తాను అమెరికాలో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చి కొడుకును కన్నదని, తండ్రి ఎవరో తెలియాలంటే.. విజయసాయి రెడ్డికి, హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్ రెడ్డికి డిఎన్ఏ పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన భార్య విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, హోంమంత్రి అనితను కలిసి విన్నవించుకున్న మదన్ మోహన్.. గట్టిగా పట్టుపడుతుండడంతో.. వ్యవహారం సంచలనం అవుతోంది.
మదన్ మోహన్ చెబుతున్న ప్రకారం.. ఆయన అమెరికాలో ఉండగా విజయసాయిరెడ్డితో కలిసినట్టుగా, అందువల్లనే కొడుకు పుట్టినట్టుగా శాంతి తనతో చెప్పిందని అంటున్నారు. కానీ.. ఆయన తాజాగా ఆరోపణలు చేస్తూ వివాదం రేకెత్తిన తర్వాత మాత్రం శాంతి అలాంటి మాట ఎక్కడా చెప్పలేదు. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదన వెలిబుచ్చిన శాంతి.. 2016లోనే తన భర్త మదన్ మోహన్ కు గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చానని అంటున్నారు. అదే సమయంలో.. న్యాయవాది సుభాష్ రెడ్డిని పె ళ్లిచేసుకున్నట్టు చెబుతున్నారు. తన కొడుకు ఆయనకే పుట్టాడని అంటున్నారు.
కానీ మదన్ మోహన్ ఊరుకోవడం లేదు. ఎవరి బిడ్డో తెలియాలంటే ఈ ఇద్దరికీ కూడా డిఎన్ఏ పరీక్ష చేయించాలని అంటున్నారు. ఇప్పటికే విజయసాయి ఈ విషయంలో చాలా ఫైర్ అవుతున్నారు. గిరిజన మహిళ మీద అనవసర అభాండాలు వేస్తున్నారని అంటున్నారు. అయితే పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు రకరకాల ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అవన్నీ నిరాధారాలుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. అందుకే నాయకులు చాలా తరచుగా.. ఆలయాల్లో ప్రమాణాలు చేస్తాం అని, తమ మీద ఆరోపణలు ఆధారాలు ఉంటే చూపించాలని అంటుంటారు. శాంతితో కొడుకును కన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి.. తన సచ్ఛీలుడిని అని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షకు సిద్ధమవుతారా? అనేది ప్రజల సందేహంగా ఉంది. నిజానికి, మదన్ మోహన్ కోరుతున్నట్టుగా విజయసాయి, సుభాష్ ఇద్దరూ డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సుభాష్ పరీక్షలు చేయించుకుని, శాంతి కొడుకు తన బిడ్డే అని చాటుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఈ వివాదం ముందు ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.