న్యాయస్థానాల్లో ఒకే తరహా విజ్ఞప్తులతో దాఖలయ్యే పిటిషన్లు విషయంలో ఒక తీర్పు వస్తే.. దాని ప్రభావం.. మిగిలిన పిటిషన్ల మీద కూడా పడుతుంది. ఒకే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు.. తీర్పులు కూడా అదే తరహాలో రావొచ్చుననే అభిప్రాయం పలువురికి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం గమనిస్తే.. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు అయిన అవినాష్ రెడ్డికి, ఇప్పటికే రిమాండులో గడిపి బెయిలు మీద బయటకు వచ్చిన మిగలిన నిందితులకు ప్రమాదఘంటికలు మోగినట్టే అని పలువురు అంచనా వేస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కీలక నిందితులకు బెయిలు ఇచ్చే విషయంలో.. కోర్టు చేసిన వ్యాఖ్యలు.. తమ కేసుల్లో కూడా సుప్రీం కు స్ఫురిస్తే గనుక.. గడ్డురోజులు తప్పవని అవినాష్ రెడ్డి శిబిరం ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అడ్డగోలుగా డిస్టిలరీలనుంచి కాజేసీ, సొంత ఖజానాను నింపుకున్న జగన్ అండ్ కో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలుసు. వీరిలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ల విషయంలో ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారు తమ పిటిషన్లో… కుంభకోణంలో తమ పాత్రకు సంబంధించి దర్యాప్తు పూర్తయినదని.. తమ పాత్ర గురించి రెండో చార్జిషీటులో కూడా పేర్కొన్నారని, ఆల్రెడీ తాము 90 రోజులుగా రిమాండులోనే ఉన్నామని.. కనుక తమకు బెయిలు ఇవ్వాలని వారు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు పూర్తయినంత మాత్రాన.. బెయిలు ఇవ్వాలనే నిబంధన లేదని, అలా ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. ఇది అవినాష్ దళానికి వార్నింగ్ లాంటి తీర్పు అని చెప్పాలి.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, అనుచరుడు శివశంకర్ రెడ్డి తదితరులందరి బెయిళ్లను రద్దు చేయాలనే డిమాండుతో హత్యకు గురైన వివేకానందరెడ్డి కూతురు సునీత సుప్రీం కోర్టులో దావా నడుపుతున్నారు. ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని, సుప్రీం ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ ఇప్పటికే ఒక అఫిడవిట్ వేసింది. అలాగే.. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ స్వయంగా చెప్పేసింది గనుక.. ఇక ఎవరి బెయిళ్లు రద్దు కావు అని అవినాష్ దళం హేపీగా ఉన్నారు. ఇదే సమయంలో.. జైలులో మిగిలిన ఒకే ఒక నిందితుడు గంగిరెడ్డి కూడా తాజాగా బెయిలుపై విడుదల అయ్యారు. అందరికీ బెయిలు ఇచ్చి ఆయన ఒక్కడిని జైల్లో ఉంచడం కరెక్టు కాదనే వాదనలను ఆమోదించి సుప్రీం ఆయనకు బెయిలు ఇచ్చింది.
కానీ.. దర్యాప్తు పూర్తయినంత మాత్రాన.. బెయిలు ఇవ్వలేం అని లిక్కర్ కేసులో వచ్చిన తీర్పు.. అవినాష్ దళానికి హెచ్చరికే. ఇప్పటికే ఎందరి బెయిళ్లు రద్దు చేయవచ్చునో చెప్పాలని సీబీఐను ఆదేశించి.. వాయిదా వేసిన నేపథ్యంలో.. వారి బెయిళ్లు రద్దు కావొచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.