వల్లభనేని వంశీది ఇల్లా? సత్రమా?

గన్నవరానికి చెందిన ఈ వివాదాస్పద రాజకీయ నాయకుడు హైదరాబాదులోని గేటెడ్ కమ్యూనిటీలో చాలా పకడ్బందీ రక్షణ ఏర్పాట్ల మధ్య నివాసం ఉంటారు. అలాంటి చోట ఆయన ఉంటున్నది… ఇళ్లా? సత్రమా? ఎవరో తెలియని వ్యక్తులు కూడా వచ్చి రాత్రికి ఉండి తెల్లార్తో వెళ్లిపోతాం అంటే.. వల్లభనేని వంశీ వారిని తన  ఇంట్లోకి అనుమతించి, రాత్రంతా ఇంట్లోనే ఉండనిచ్చి ఉదయం వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేస్తారా? ఆయన తన ఇల్లును ప్రజలకు సత్రంలాగా వాడుకునే అనుమతులు ఇచ్చారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. ఎందుకంటే.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, నిర్బంధించిన కేసులో రిమాండు ఖైదీగా జైల్లో ఉన్న వంశీ.. పోలీసు కస్టడీలో వారి విచారణ ప్రశ్నలకు జవాబులు చెప్పిన తీరు ఇలాంటి అనుమానాల్ని కలిగిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక్కటే సూత్రాన్ని ఎంచుకున్నారు. ఏ కేసుల్లో అరెస్టు అయినా సరే.. నేరం ఎలాంటిది అయినా సరే.. తమ ఫోన్లు విచారణ అధికారుల చేతికి ఇవ్వకూడదు. వారికి చిక్కకుండా చూసుకోవాలి. విచారణలో ఏ ప్రశ్నలు అడిగినా సరే.. సూటిగా సమాధానాలు చెప్పకూడదు. ఏమైనా క్లిష్టమైన ప్రశ్నలు వచ్చినప్పుడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా వంటి సమాధానాలతో దాటవేయాలి.. అనేది వారు అనుసరిస్తున్న సిద్ధాంతం. అలాంటిది.. దళితయువకుడి కిడ్నాప్, నిర్బంధం కేసులతో పీకల్దాకా కూరుకుపోయిన వల్లభనేని వంశీ మాత్రం భిన్నంనగా ఎందుకు స్పందిస్తారు. ఆయన కూడా అలాంటి జవాబులే చెప్పారు. అన్నీ డొంకతిరుగుడు  మాటలతో పోలీసుల్ని బుకాయించాలని ప్రయత్నించారు.

సత్యవర్దన్ ను ఎందుకు అపహరించారు? హైదరాబాదులోని మీ ఇంట్లో ఎందుకు ఉంచారు? అని అడిగినప్పుడు.. అందుకు వల్లభనేని వంశీ చెప్పిన జవాబులు చిత్రంగా ఉన్నాయి. రాయదుర్గంలోని మా ఇంటికి వచ్చి.. ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. అతడే సత్యవర్ధన్ అని నాకు తెలియదు.. ఉదయాన్నే మా వాళ్లతో కలిసి కారులో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు అంటూ వంశీ బుకాయించే ప్రయత్నం చేశారు.
రాయదుర్గంలో వంశీ చాలా కట్టుదిట్టమైన గేటెడ్ కమ్యాూనిటీలో ఉంటారు. లోపలి నుంచి ఇంటి యజమాని అనుమతిస్తే తప్ప.. మరో నరమానవుడు ఆ కమ్యూనిటీలోకి అడుగుపెట్టడం కూడా సాధ్యం కాదు. ఎంతమంది లోనికి వెళుతున్నారు? అనేది కూడా నివాసంలోంచి యజమాని ధ్రువీకరించాల్సిందే! అలాంటిది సత్యవర్ధన్ ఎవరో తెలియకుండానే.. వచ్చిన వాడు సత్యవర్దన్ అనే స్పృహ లేకుండానే.. కమ్యూనిటీలోకి రానిచ్చారా? తన ఇంట్లో ఉండనిచ్చారా? ఇలాంటి బుకాయింపుల్ని పోలీసుల ఎదుట టైం సాగదీయడానికి ఉపయోగపడుతుందేమోగానీ.. ప్రజలను నమ్మించగలదా? వంశీ బుకాయింపులతో ఈ కేసు నుంచి తనను తాను కాపాడుకోగలరా? అని జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అతను సత్యవర్దన్ అనే సంగతి తనకు తెలియదని అనడం ద్వారా.. కేసులో మరింత లోతుగా ఇరుక్కుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories