మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యే పరిణామం బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. జగన్ దళాలు లిక్కర్ కుంభకోణంలో దోచుకున్న దానిని దాచిపెట్టిన డెన్ నుంచి.. ఏకంగా 11 కోట్ల రూపాయలు సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓడిపోయిన తర్వాత మాత్రమే కాదు.. 2019లో తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి కూడా.. చంద్రబాబునాయుడు గురించి తిట్టడంలో ఒక మాట వాడడం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు. ‘చంద్రబాబుకు తెలిసినదెల్లా ఒక్కటే. దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడం’ అనేది ఆయన పాట! అదేమాదిరిగా గమనించినప్పుడు- ఇటీవలి కాలంలో లిక్కర్ కుంభకోణం అరెస్టులు మొదలైన తర్వాత.. జగన్ సహా.. వైసీపీ దళాలందరూ ఒక పాట పాడడం ప్రారంభించారు. ‘లిక్కర్ కుంభకోణం పూర్తిగా అబద్ధం. ఒక్క ఆధారమైనా దొరికిందా? ఒక్క రూపాయైనా దొరికిందా’ అని పాచిపోయిన పాట పాడడం అందరూ అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పాటకు కూడా కాలం చెల్లింది. ఇప్పుడు వారు దోచుకున్న సొమ్ము, హైదరాబాదు సమీపంలో దాచుకున్న సొమ్ము ఏకంగా 11 కోట్ల రూపాయలు దొరికింది. ఇప్పుడు వారేం చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దళాలు కొత్తగా తాము ఏం మాట్లాడాలో తెలుసుకోవడానికి తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఏం మాట్లాడాలో తాడేపల్లి ప్యాలెస్ డిసైడ్ చేస్తుంది. అందుకే అందరి నిరీక్షణ. అయితే తాడేపల్లి ప్యాలెస్ లో తమను తాము సమర్థించుకోవడానికి, అసలు తమ తప్పేమీ లేదని చెప్పడానికి కొత్తపాట సిద్ధమవుతున్నట్టు సమాచారం. అదేంటంటే..
‘కాచారం ఫాంహౌస్ లో దొరికిన డబ్బుతో మా పార్టీకి గానీ, మా పార్టీ నాయకులకు గానీ సంబంధం లేదు. ఎక్కడో ఏదో డబ్బు దొరికితే.. అది మద్యం కుంభకోణంలో దొరికిన సొమ్ము అని అభివర్ణించి మామీద బనాయించిన అక్రమ కేసుల్లో వేధించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగమే’ అని కొత్తగా నిందలు వేయడానికి వారు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 11 కోట్ల రూపాయలు కోల్పోవడం వల్ల కాస్త గుండె కలుక్కుమని అంటున్నప్పటికీ.. ఎటూ పోలీసులకు ఆ డబ్బు దొరికిపోయింది గనుక.. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని చెప్పడమే మంచిదని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేసమయంలో తమను తాము సమర్థించుకోవడానికి కొత్త పాట పాడడానికి ప్లాన్ బీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే..
‘చంద్రబాబునాయుడు తన అవినీతి సొమ్ముతో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దలే కాచారం గెస్ట్ హవుస్ లో 11 కోట్ల రూపాయలు తమ డబ్బులే పెట్టించి.. అవి సిట్ పోలీసులకు దొరికేలా చేసి.. అవన్నీ లిక్కర్ కుంభకోణంలో దొరికనవని చెప్పే కుట్ర చేస్తున్నారు. దొరికిన డబ్బు చంద్రబాబునాయుడు అవినీతి సొమ్మే.. ఆయన అక్కడ పెట్టించిన డబ్బులే.. దీనికి సంబంధించి మా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. సందర్భం వచ్చినప్పుడు బయటపెడతాం’ అనే పాట కూడా పాడడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
మీడియా ముందు బొంకులు వల్లె వేయడానికి.. వైసీపీ నాయకులకు ఈ కొత్త పాటలు పనికొస్తాయేమో గానీ.. ప్రజలు మాత్రం జగన్ దళాల దోపిడీని స్పష్టంగానే గుర్తించారని, జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఈ లిక్కర్ స్కామ్ మరణశాసనం లిఖిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.