వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కిందట పార్టీ పీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ కమిటీ పేరు పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ. కానీ.. దాని తీరు మాత్రం పొలిటికల్ లిజనరీ కమిటీ అన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు సమావేశం జరిగినా.. కమిటీలోని ఏ ఒక్కరూ జగన్ అడ్వయిజ్ లు చెప్పే స్థితిలో ఉండరు. ఎందుకంటే అలాంటి పని చేస్తే.. ఇక తాము ఆ కమిటీలో ఉండం అనే సంగతి వారికి తెలుసు. జగన్ కు తాను చెప్పేది ఎదుటివాళ్లు వినాలనే కోరిక తప్ప.. తనకు ఎవరైనా ఏమైనా చెబితే ఆయన చెవిలో వేసుకోరు. ఇలాటి పరిస్థితుల్లో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇంతకూ ఆ సమావేశంలో ఆయన వారందరి ద్వారా రాష్ట్రంలోని పార్టీ కి చెప్పదలచుకున్నది ఏమిటి? తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మీద, అధికారుల మీద కక్ష సాధించడానికి తాను ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయిస్తున్నాను అని మాత్రమే. మొత్తం సమావేశం తీర్మానాలు కార్యకర్తలకు పంపిన సందేశం అది మాత్రమే.
ఈ యాప్ ను సృష్టించడం ద్వారా తానేదో కార్యకర్తలకు మహోపకారం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారు. ఆ యాప్ లో తెలుగుదేశం కార్యకర్తల మీద, అధికారుల మీద తమ పార్టీ కార్యకర్తలు ప్రతి ఊరిలోనూ వివరాలు నమోదు చేయవచ్చునంట. సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే వాటిని కూడా జతచేయవచ్చునని పిలుపు ఇచ్చారు. అంటే అర్థం ఏమిటన్నమాట.. ఆధారాలు లేకపోయినా కూడా యాప్ లో ఫిర్యాదులు అయితే నమోదు చేయవచ్చు. తాము అధికారంలోకి రాగానే వారందరి భరతం పడతారట.
ఈ యాప్ సృష్టి ద్వారా… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే, ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మహోపకారం చేసినట్టుగా, వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా, వారి జీవితాలకు ఒక బంగారు భవిష్యత్తును నిర్దేశించినట్టుగా జగన్మోహన్ రెడ్డి.. బిల్డప్ ఇస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఇదేనా? కార్యకర్తల కోసం ఏమైనా చేయడానికి ఆయనకు ఇంతకుమించిన ఆలోచనలేమీ రావా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే.. రెంటపాళ్ల పర్యటనకు వెళ్లినప్పుడు.. రప్పారప్పా నరుకుతాం అనే నినాదాల ఫ్లెక్సిలతో అరెస్టు అయిన జగన్ అభిమాని.. నిజానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిఉన్నట్టుగా తేలింది. అంటే అర్థం ఏమిటి?. జగన్ ను అభిమానించే వాళ్లు కూడా.. తమకు బీమా వంటి సదుపాయాలు, మరికొన్ని ఫెసిలిటీస్ వస్తాయని వెళ్లి తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటున్నారన్నమాట. ఒక పార్టీ అధినేతగా ఇది జగన్ కు సిగ్గు చేటు అనిపించే వ్యవహారం కాదా? కార్యకర్తల జీవితాల కోసం జగన్ మంచి ఆలోచనలేమీ చేయలేరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాప్ చేస్తా.. మీరు పితూరీలు చెప్పండి.. మనం అధికారంలోకి వచ్చాక వాళ్లందరినీ నరుకుతాం అని చెప్పడానికే జగన్ ఉన్నారా? పార్టీ కష్టాల్లో ఉన్నా సరే.. మీ జీవితాల్లో కష్టాలు లేకుండా చూస్తా అంటూ జగన్ కార్యకర్తల కోసం ఒక హామీ ఇవ్వలేరా? అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది.