ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుక్రవారం రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా వెలగపూడి సచివాలయం వద్దకు వస్తారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకుంటారు. అమరావతి రాజధాని నగర పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 49 వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన జరగబోతున్నదని, ఇంకో 8 వేల కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని, దాదాపు మరో 50 వేల కోట్ల రూపాయల విలువైన కేంద్రప్రభుత్వపు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుడతారని వార్తలు వస్తున్నాయి. ఇంతటి బృహత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతూ.. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రప్రజలకు ఇవ్వబోతున్న కానుక ఏంటి? అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసి, కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తే గనుక.. ఇక అమరావతికి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉంటాయనేది విశ్లేషకుల మాట. అమరావతి ప్రాంతాన్ని అద్భుత నగరంగా చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు. అదే సమయంలో.. అమరావతిని మరుభూమిగా మార్చేయాలని జగన్ కంకణం కట్టుకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ కూటమి ప్రభుత్వం తర్వాత.. మళ్లీ జగన్ సర్కారు ఏర్పడితే.. ఈ రాజధాని పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ప్రారంభం కాబోతున్న పనులన్నీ మూడేళ్లలోగా పూర్తిచేస్తాం అని ప్రభుత్వంలోని పెద్దలు ఢంకా బజాయించి చెబుతున్నప్పటికీ.. ఒకవేళ పనులు పూర్తికాకుండా, ఈలోగా జగన్ రాజరికం వస్తే ఏమవుతుంది? అనే భయాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. అందుకే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నోటిఫై చేస్తూ కేంద్రం చట్టం చేస్తే గనుక.. ఇక ఎవ్వరూ కూడా దీనిని విషపు చూపు చూడడానికి అవకాశమే ఉండదు. జగన్ మళ్లీ సీఎం అయినా సరే.. అమరావతి రాజధాని హోదాకు ఆయన చేయగల చేటు ఉండదు. అందుకే ప్రధాని మీద ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు.
అమరావతి నిర్మాణానికి, రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే కేంద్రం పలురకాలుగా సహకారం అందిస్తోంది. అడిగిన వెంటనే అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు, మెట్రో ప్రాజెక్టు వంటి ప్రతిదీ కేంద్రం కేటాయిస్తోంది. ఇలాంటి క్రమంలో.. రాజధానిగా నోటిఫై చేసే చట్టం కూడా తెస్తే అది మహోపకారం అవుతుంది. శుక్రవారం సాయంత్రం సభలో నరేంద్రమోడీ అదే విషయం ప్రకటిస్తారని, ఏపీ ప్రజల కలల్లో ఇలాంటి భయాలు లేకుండా చూస్తారని అంతా అనుకుంటున్నారు.