వైఎస్సార్ స్ఫూర్తికి ఇది జగన్ చేసిన ద్రోహం కాదా?

పేదప్రజల ఆరోగ్య భద్రతకు అండగా నిలవడం, పేదల చికిత్సకు ప్రభుత్వాలు సాయం అందించడం కొత్త సంగతి ఏమీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డికంటె ముందునుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకోసం జరుగుతూనే ఉన్నాయి. అయితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అని పేరు పెట్టి.. ఇలాంటి పేదలకు ఆరోగ్యసాయం అందించే కార్యక్రమాలన్నింటికీ ఒక వ్యవస్థీకృతరూపం కల్పించారు. అయితే వైఎస్సార్ కొడుకు జగన్మోహన్ రెడ్డి.. తన చవకబారు రాజకీయాలతో.. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందకుండా దుర్మార్గమైన, దయనీయమైన పరిస్థితికి కారణం అయ్యారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప.. వాస్తంగా పరిపాలన పరంగా చేయాల్సిన అన్ని పనులు సక్రమంగా చేయడంపై ఎన్నడూ దృష్టి ఉండదని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటూ ఉంటారు. రాష్ట్రంలో తాను సృష్టించుకున్న ఓటు బ్యాంకుగా ఆయన భ్రమపడిన.. సంక్షేమ పథకాల గురించి మాత్రమే దృష్టి పెట్టారు. ఉద్యోగులకు జీతాలు అనేవి నెలదాటిపోయినా పడేవి కాదు గానీ.. పెన్షన్లు మాత్రం ఒకటో తేదీ ఇళ్ల వద్దకు పంపుతూ వచ్చారు. ఏవి ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగపడతాయో.. ఏవి బయటకు కనిపిస్తాయో అలాంటి  వాటి మీద మాత్రమే.. డబ్బులు పంచడంలో కూడా ఆయన శ్రద్ధ పెట్టారు. అంటే ప్రజలకు తాను వేసే డబ్బులు మాత్రం పంచారు.

అదే సంక్షేమ పథకాల ముసుగులో కనిపించే ఆరోగ్య శ్రీ నిధులు గానీ, ఫీజు రీఇంబర్స్ మెంటు నిధులు గానీ విడుదల చేయనేలేదు. తల్లుల, విద్యార్థుల ఖాతాల్లో పడే ఫీజులైనా ఎన్నికల తర్వాత ఈసీ అనుమతితో పడ్డాయి గానీ.. ఆరోగ్య శ్రీ నిధులు ఇవ్వాలనే సంగతిని ప్రభుత్వం కుట్రపూరితంగా మరచిపోయింది.

దాదాపు 1500 కోట్ల మేర ఏపీలో బకాయిలు పేరుకుపోయిన తర్వాత.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నీ కలిసి సమ్మెచేస్తున్నాయి. చికిత్సలు, ఆపరేషన్లు మానేశాయి. ప్రభుత్వం ఏదో ముష్టిలాగా 203 కోట్లు విదిలించి.. వారితో పనులు చేయించడానికి ప్రయత్నించినా.. ఫలించలేదు. కనీసం యాభైశాతం విడుదల చేయకపోతే.. ఆరోగ్య శ్రీ కేసులు ముట్టుకునేది లేదని తేల్చేశారు. జగన్ సర్కారు ఈ పథకం డబ్బు విడుదల చేయకపోవడం అనేది.. అచ్చంగా వైఎస్సార్ స్పూర్తికి చేస్తున్న ద్రోహమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు తన ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరొక అంశం ఏదీ పట్టదని కూడా అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories