తిరుమల లడ్డూల్లోని నెయ్యి కల్తీ వ్యవహారం యావత్ దేశాన్ని కుదిపేస్తున్నది. హిందూ సమాజం మొత్తం కత్తులు నూరుతున్నది. ఇంత జరుగుతున్నా సరే.. వైసీపీ జమానాలో కీలకంగా టీటీడీ బాధ్యతలు చూసిన ఉన్నతాధికారి ధర్మారెడ్డి మాత్రం ఎక్కడా చప్పుడు చేయడం లేదు. పదవీవిరమణ కూడా పూర్తయిన ఆయన ఎలాంటి సంజాయిషీ గానీ, వివరణ గానీ ఇవ్వలేదు. ఆయన అస్సలు నోరు మెదపకపోవడం కారణంగాన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దల మీద కొత్త అనుమానాలు పుడుతున్నాయి.
తిరుమల వ్యవహారాల్లో ఇదివరకు ఏ ఆరోపణ వచ్చినా కూడా తగుదునమ్మా అంటూ ఈవో ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చేవారు. రాజకీయ నాయకులకంటె ఎక్కువగా కౌంటర్లు ఇస్తూ, ఎదురుదాడిచేస్తూ వివరణలు ఇచ్చేవారు. శ్రీవాణి టికెట్ల బాగోతం దగ్గరినుంచి ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ వచ్చింది. అయితే నెయ్యి కల్తీ విషయంలో ఆయన ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. ఈ మౌనం వెనుక రహస్యం ఏమిటి? అని పలువురు సందేహిస్తున్నారు.
ఈ డీల్స్ జరిగిన సమయంలో, కల్తీ నెయ్యి సరఫరా అయిన సమయంలో కీలక అధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి నోరు మెదపకపోతే.. అనుమానాలు బోర్డు బాధ్యతల్లో ఉన్న వైసీపీ నాయకుల మీదికే వెళతాయి. వైవీ సుబ్బారెడ్డి ఇప్పటిదాకా కోర్టులో వ్యాజ్యాలు వేస్తున్నారే తప్ప ప్రమాణాల జోలికి వెళ్లలేదు. పైగా బాబు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్మారెడ్డి నోరు తెరవకపోవడం వలన.. అందరి దృష్టి వైవీసుబ్బారెడ్డి వైపు వెళుతోంది. ఆయన జమానా మొదలైన తర్వాతే లడ్డూ నాణ్యత దిగజారిపోయిందనే అభిప్రాయం అందరిలో ఉంది. వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
వైవీ తరువాత.. టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం తిరుమలలో సోమవారం ప్రమాణం చేశారు. కానీ ధర్మారెడ్డి బయటకు రాకపోవడం చాలా మందికి ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఈ వైసీపీ నాయకులు ఎంతగా ఇరుక్కుపోతే మాత్రం తనకేంటి అనే ధోరణిలోకి వెళ్లిపోయారా? అని ప్రజలు అనుకుంటున్నారు.