వైసీపీకి 5 సీట్లు మించి ఇచ్చే ఉద్దేశం లేదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదంతో రాజకీయం చేస్తోంది. వై నాట్ కుప్పం అని జగన్ పదేపదే అంటూ వచ్చారు. పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం గురించి ఎవరైనా అడిగితే.. 175 లో అది కూడా భాగమే కదా.. అని సెటైరికల్ సమాధానం ఇస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి మాటలను గమనిస్తే.. ఫ్యాను గుర్తు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5కు మించి సీట్లు ఇస్తే రాష్ట్రానికి ప్రమాదమే అని ఆమె అంటున్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. సోమువీర్రాజు చేతులనుంచి పురందేశ్వరి పగ్గాలుతీసుకున్న తరువాత.. బిజెపి , వైసీపీతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నదనే విమర్శలు తగ్గాయి. అంతకుముందు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో జగన్ పాలన మీద బిజెపి విమర్శలు.. తమలపాకుతో స్పృశించినట్లుగా ఉండేవి. పురందేశ్వరి హయాం మొదలైన తర్వాత తలుపుచెక్కతో వడ్డించడం లాగా తయారయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వపు దందాలు, ఇసుక దందాలలో సాగుతున్న వేల కోట్ల దోపిడీ, లిక్కర్ వ్యాపారంలో ప్రతిరోజూ ఎన్నేసి కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయనే విషయాలను పురందేశ్వరి గణాంక వివరాల సహా పదేపదే ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు.
దానికి తగినట్టుగానే ఎన్నికల సీజను వచ్చేసరికి భారతీయ జనతాపార్టీకి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు కుదిరింది. ఇప్పుడు జగన్ ను ఓడించి.. అధికారం హస్తగతం చేసుకోవడానికి కూటమి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి ఒక ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5కు మించి సీట్లు ఇవ్వడం రాష్ట్రానికి ప్రమాదకరం అని అర్థం వచ్చేలా విమర్శలు చేశారు. వైసీపీ దుర్మార్గమైన పరిపాలన వలన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారని, అందువల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారని ఆరోపిస్తున్న పురందేశ్వరి అందుకు ఒక కారణం కూడా వివరించారు. ఇంట్లో ఉండే ఫ్యాన్ కు 1 నుంచి 5 నెంబర్ల వరకు స్పీడ్ పెట్టగలుగుతాం.
అంతవరకు అది బాగానే తిరుగుతుంది.  రాష్ట్రంలో పొరబాటున ప్రజలు ఫ్యాన్ స్పీడును 151 వద్ద పెట్టేశారు. ఫ్యాను ఓవర్ స్పీడ్ అయిపోయి.. ఇంటిపైకప్పు కూడా కూలిపోయి ప్రజలంతా శిథిలాలలో చిక్కుకున్నారు… అంటూ ఆ పార్టీ సాధించిన సీట్ల గురించి పురందేశ్వరి ఎద్దేవా చేస్తున్నారు. అంటే.. ఈ ఎన్నికల్లో 5సీట్లకు మించి ఫ్యాను స్పీడు నెంబరు పెంచే కొద్దీ.. రాష్ట్రానికి ఓవర్ స్పీడ్ ప్రమాదం పెరుగుతూ ఉంటుందని దగ్గుబాటి పురందేశ్వరి సంకేతాలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories