సాధారణంగా నాయకులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారికి రకరకాల చేదు అనుభవాలు ఎదురుకావడం కొత్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు అయితే.. తమ సభలో ఎవరైనా ప్రజలు తేడాగా వ్యవహరిస్తే, నిరసనలను తెలియజేస్తే.. వారిమీద కఠిన చర్యలు తీసేసుకునేవారు. కానీ.. ఎన్నికల ప్రచార సభల్లో అలా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని వారికి భయం. అధికారపార్టీ నాయకుడే కావొచ్చు గాక.. కానీ నిరసనలు తెలియజేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తే ప్రజలంతా తిరగబడతారని భయం. ఇలాంటి నేపథ్యంలో గుత్తిలో బస్సు మీద నిల్చుని వెళ్లున్న జగన్ మీదికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. సీఎం జగన్ తో పాటు, భద్రత సిబ్బంది గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తదితర నాయకులు ఉండగానే వారిమీదకు గాల్లోంచి చెప్పు వచ్చింది. అయితే ఎవ్వరిమీదా పడలేదు. చెప్పు విసిరింది ఎవరనే వెతుకులాట జరిగినట్టుగా లేదు. పోలీసులు గానీ.. పార్టీ నాయకులు గానీ దీని మీద మాట్లాడలేదు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఆ చెప్పు ఎవరిదనే విషయం పెద్ద ప్రధానం కాదు. జగన్ మీద ఎంతగా కడుపుమంట లేకపోతే.. వారు ఆ చెప్పు విసిరారా అనేది గమనించాలి. ఇన్నాళ్లూ పరదాలు కట్టుకుని, బారికేడ్లు కట్టేసి.. తాను సభలునిర్వహిస్తే ప్రజలందరినీ చెప్పులు బయటే విడిచేసి లోని వచ్చేలా ఏర్పాట్లు చేసుకుని పరువు కాపాడుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఎన్నికలు గనుక.. తప్పనిసరి గనుక.. ప్రజల్లోకి వచ్చేసరికి చేదు అనుభవాలను చవిచూస్తున్నారు.
బస్సుయాత్రలో వరుసగా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఒకరోజు మహిళలందరూ ఖాళీ బిందెలతో బస్సుకు అడ్డం పడ్డారు. రెండోరోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఉండగా.. పోలీసులు వారినుంచి బిందెలు లాగేసుకున్నారు గానీ.. మహిళలు మాత్రం బస్సుకు అడ్డం పడి, జగన్ బస్సులోంచి దిగి వారికి సంజాయిషీ చెప్పేవరకు అటకాయించారు. నీటిసమస్యపై నిరసన తెలియజేశారు. ఇవాళ ఏకంగా చెప్పు పడింది.
ప్రజల్లో ఇంతటి ఆగ్రహం ఉన్నప్పుడు.. ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో.. జగన్ కు ఒక అంచనా ఉండాలి.
ప్రజల్లో ఇలాంటి ఆగ్రహానికి మూలం ఏమిటో ఆయన తెలుసుకుంటే తప్ప.. ప్రజలను శాంతింపజేయలేరు. ఎన్నికల్లో నెగ్గలేరు. కానీ అహంకారపూరితమైన జగన్ వైఖరి.. ప్రజల్లోఉన్న ఆగ్రహం గురించి ఎవరైనా వాస్తవాలు చెప్పినా వినేస్థితిలో ఉండనివ్వదని పలువురు అంచనా వేస్తున్నారు. ముందుముందు ప్రజానిరసనలు వెల్లువై.. జగన్ బస్సుయాత్రను చాలించుకుని హెలికాప్టర్ లో తిరుగుతూ.. బహిరంగసభలు మాత్రం నిర్వహించే పరిస్థితి వస్తుందని పలువురు అంటున్నారు.