మాజీ ముఖ్యమంత్రి వర బాధిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించే విషయంలో కూడా తన సంకుచిత బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. ఆయన ఏపీలో వరద బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే ఆ సొమ్ము జగన్ ఇచ్చినట్టుగా కాదన్నమాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినట్టుగా ప్రకటించారుట. అది కూడా దానిని ఏ ముఖ్యమంత్రి సహాయ నిధికో ఇవ్వకుండా.. నేరుగా తమ పార్టీ వారి ద్వారానే ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశించారుట. దాంతో ఇన్నాళ్లూ వరద తీవ్రత ముప్పు బాగా ఉన్నప్పుడు గడప దాటకుండా ఉండిపోయిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ప్రజలందరూ శిబిరాలకు తరలిన తర్వాత.. వరద తీవ్రత ఉపశమించిన తరువాత ఆహార పొట్లాలు వాటర్ బాటిళ్లు పట్టుకుని డ్రామా ఆడడానికి రంగంలోకి దిగారు.
అంటే ఏమిటన్నమాట? కోటిరూపాయల విరాళం ఇస్తున్నది జగన్ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది కూడా వారు పంచిపెట్టే నీళ్ల సీసాలు, అన్నం పొట్లాల రూపంలో లెక్క చెప్పేయబోతున్నారు. రెండు రోజుల ఈ పంపకాల నాటకం నడిపించి.. కోటి రూపాయల విలువకు సరిపడేలా ఇన్ని వేల అన్నం ప్యాకెట్లు పంచాం, ఇన్ని లక్షల వాటర్ బాటిళ్లు పంచాం అని ప్రకటించి వారు చేతులు దులుపుకోగలరు. చివరికి ఇవి పంచడానికి వైసీపీ నాయకులు ఎక్కి తిరుగుతున్న ట్రాక్టర్ల అద్దె కూడా కోటిరూపాయల లెక్కలో రాయగలరు!
ఇలాంటి పనులు చేస్తున్న వాళ్లు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. స్థానికులు సామాన్యులు కూడా వందల ఆహార పొట్లాలు తాము స్వయంగా సిద్ధం చేయించి తీవ్రత ఉన్న రోజుల్లో పంచిపెట్టారు. ఆయా రోజుల్లో అసలు వైసీపీ నేతలు గడపదాటి బయటకు రాలేదు. కేవలం ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. జగన్ కోటిరూపాయలు వైసీపీ పార్టీ తరఫున ప్రకటించిన తరువాత.. వారు బయటకు వచ్చారు. ఇంతకీ ఆ అన్నం పొట్లాలు తయారుచేసేవారికి, వాటర్ బాటిళ్లకు డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారో.. లేదా, రెగులర్ గా సాగించే దందాల్లాగానే నడిపిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు.
అసలే తెలంగాణకు ఒక్కరూపాయి సాయం కూడా ప్రకటించకుండా ఏపీకి మాత్రం జగన్ సాయం అందించడంపై కొన్ని విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగా ఆ ఒక్క కోటి రూపాయలతో.. తమ పార్టీ నాయకులందరూ అపరిమితమైన కీర్తిని గడించాలని జగన్ ఆశించడం చాలా సంకుచితంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.