అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రసాద్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పే తీరాలంటూ జూ. ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ హైదరాబాదులోగానీ, బెంగుళూరులోగానీ ఎక్కడ ఉన్నా గానీ.. అనంతపురానికి వచ్చి తమకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని వారు ఒక రోజంతా నానా యాగీ చేశారు. అయితే.. కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. వీరి ఆందోళనలు అనేక సందేహాలను కూడా కలిగిస్తున్నాయి. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెనుక ఎవరో ఉండి, ఇదంతా చేయిస్తున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. జూ.ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా అనంతపురంలో ఎలా ఆడుతుందో చూస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నట్టుగా ఆడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ తల్లి గురించి కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్టుగా అందులో ఉంది. ఒకవేళ అలా మాట్లాడినందుకు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణ మాత్రమే కోరుకుంటూ ఉంటే గనుక.. ఆ ఎపిసోడ్ ఎప్పుడో ముగిసిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే.. వివాదం రేగిన సమయంలోనే.. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల చేశారు. ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని అన్నారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయినాసరే.. తన పేరు ఆ ఆడియోతో ముడిపడి బయటకు వచ్చినందున.. అలాంటి వ్యాఖ్యల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నొచ్చుకునిఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని చాలా స్పష్టంగా దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అక్కడితో క్షమాపణల ఎపిసోడ్ ముగిసినట్టే కదా.
కానీ.. తీరిగ్గా రెండు రోజుల తర్వాత.. అనంతపురంలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని, ఇంటిని ముట్టడించడానికి పూనుకున్నట్టుగా ఫ్యాన్స్ ఎగబడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చూడబోతే ఇదంతా దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యర్థులు ఆడిస్తున్న నాటకం లాగా కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దగ్గుపాటి ప్రసాద్ కు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తో తగాదాలు ఉన్నాయి. ఈ విభేదాలు పతాకస్థాయికి వెళ్లి ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇరువురినీ పిలిపించి మాట్లాడారు కూడా. అయితే ఎమ్మెల్యే ప్రసాద్ ఒకసారి సారీ చెప్పిన తర్వాత కూడా.. ఇలాంటి ఆందోళనలు జరగడం ప్రేరేపితమే అనిపిస్తోంది. వీటి వెనుక మాజీ ఎమ్మెల్యే ఉండవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే.. దగ్గుపాటి ప్రసాద్.. జూ.ఎన్టీఆర్ ను దూషించినది నిజమే అయితే గనుక.. అనంతపురం జిల్లాలో మాత్రమే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయా? రాష్ట్రమంతా ఫ్యాన్స్ ఆందోళనలు చేయాలి కదా? అనేది పలువురి వాదన. ఆందోళనలు ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయంటే.. దాని అర్థం.. వెనుకనుంచి ఎవరో నడిపిస్తున్నారని మాత్రమే అని పలువురు సందేహిస్తున్నారు. పార్టీ పరువును బజార్న పడేసే ఇలాంటి ముఠాతగాదాలను అధిష్ఠానం సకాలంలో చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు.