సానుభూతి గ్రాఫ్ పెరుగుతున్నదా? లేదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో  ఇప్పుడు ఒక కొత్త మీమాంస మొదలైంది. చాపకింద నీరులా ఆ పార్టీ కార్యకర్తలు, వారి ప్రమోషన్ కోసం పనిచేసే మార్కెటింగ్ సంస్థలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో సానుభూతి గ్రాఫ్ పెరుగుతున్నదా? లేదా? అనే సమాచారం సేకరిస్తున్నారు. సానుభూతి గ్రాఫ్ ఏమాత్రం అయినా పెరుగుతున్నట్లయితే.. ఇదే టెక్నిక్ ను ఇంకా విస్తృతంగా అమలు చేయాలని కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొడాలి నాని అనారోగ్యం పాలు కావడం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నాల్లో ఆ పార్టీ ఉంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో.. విచ్చలవిడిగా రెచ్చిపోయిన కీలక నాయకుల్లో కొడాలి నాని కూడా ఒకరు. ప్రత్యేకించి నారా చంద్రబాబునాయుడును, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను అత్యంత అసభ్యంగా, నీచంగా తిట్టిపోయడానికి కొడాలినానిని మించిన వారు లేరు అన్నట్టుగా పార్టీ ఆయనను ఒక తురుపుముక్కలాగా ఉపయోగించుకుంటూ వచ్చింది. ఆయనకూడా తనకు మీడియా ముందు బూతులు తిట్టే అవకాశం రావడమే మహద్భాగ్యం అన్నట్టుగా రెచ్చిపోతూ ఉండేవారు. రాష్ట్రంలోనే బూతుల మంత్రిగా అనన్యమైన కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జోరు పూర్తిగా తగ్గింది. ఇంచుమించుగా నియోజకవర్గం వదలి వెళ్లిపోయారు. అయితే అక్రమాలు, అవినీతికి సంబంధించి ఆయన మీద కూడా వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విషయంలో ఇంకా పోలీసులు తొలి అడుగు వేయకముందే.. కొడాలినాని అనారోగ్యానికి గురయ్యారు.

కేవలం గ్యాస్ట్రిక్ సమస్య అంటూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నానికి గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్టుగా అక్కడి డాక్టర్లు గుర్తించారు. రక్తనాళాల్లో మూడు చోట్ల పూూడికలు ఉన్నట్టు తేల్చడంతో.. స్టెంట్లు వేయడం లేదా బైపాస్ సర్జరీ చేయడం మంచిదని సూచించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బైపాస్ సర్జరీకి సహకరించే స్థితిలో లేదని అనిపించడంతో ముంబాయిలోని ఆస్పత్రికి తరలించారు.
2009లో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రమాకాంత్ పాండ్ నిర్వహణలో నడిచే ఏషియన్ హార్ట్ ఇన్స్టిటిట్యూట్ కు క్లిష్టమైన హృద్రోగ ఆపరేషన్లు చేస్తారనిగొప్ప పేరుంది. ముంబాయిలోని ఆ ఆస్పత్రికి కొడాలినానిని బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు.
అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండడంపట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వారిలో ఏమైనా సానుభూతి గ్రాఫ్ పెరుగుతోందా? అని తెలుసుకునే ప్రయత్నంలో వైసీపీ నాయకులు, వారి సర్వేసంస్థలు నిమగ్నమై ఉన్నాయి. సానుభూతి పెరుగుతూ ఉంటే గనుక.. త్వరలోనే  అరెస్టు భయం ఉన్న మరికొందరు నాయకులు కూడా.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో చేరవచ్చునని అంచనాలు సాగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories