బురద చల్లడమూ హైదరాబాదు నుంచేనా బుగ్గనా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బురద చల్లుడు ప్రణాళిక చాలా చిత్రంగా, విభిన్నంగా ఉంటుంది. పార్టీలో నాయకులు ఎవరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే.. స్క్రిప్ట్ మాత్రం తాడేపల్లి లో తయారవుతుంది. ఒక్కొక్క స్క్రిప్టును రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడికి పంపి, వారు స్థానికంగా విలేకరులను పిలిచి ఆ స్క్రిప్ట్ చదివి వినిపించాలని పురమాయిస్తారు. తద్వారా పార్టీలో సైలెంట్ గా ఉంటూ తమ రాజకీయ జీవితం గురించి ఆందోళనలో గడుపుతున్న పార్టీ నాయకులను యాక్టివేట్ చేయడం.. వారు పక్క పార్టీల వైపు చూసే ఆలోచన చేయకముందే.. వారితో ప్రభుత్వం మీద బురద చల్లించడం.. వైసిపి అనుసరించే వ్యూహం. ఇదంతా బాగానే ఉంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఎవరికి స్క్రిప్టులు పంపినా వారు తాడేపల్లి ఆదేశాల ప్రకారం మీడియా ముందు దానిని వల్లె వేస్తుంటారు. కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్క్రిప్ట్ వెళితే మాత్రం ఆయన పార్టీ పరువు తీస్తుంటారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మొత్తం ఐదేళ్లపాటు ఆయన క్యాబినెట్ లో ఒక కీలక మంత్రిగా, ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఎన్నికలలో తాను కూడా ఓడిపోయారు. ఆ తర్వాత అడపాదడపా ప్రభుత్వాన్ని మీద నింద వేయడానికి ఆయన నిర్వహించే ప్రెస్మీట్లను గమనిస్తే ఓడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి ఆయన సుముఖంగా లేరేమో అనిపిస్తుంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కాలంలో తన ప్రత్యర్థులను తప్పు పట్టడానికి రకరకాల కుటిల మార్గాలు ఎంచుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గాని రాష్ట్రంలో సొంత ఇళ్లు లేవని.. వారు గెలిస్తే రాష్ట్రంలో ఉండి రాజకీయం చేస్తారు.. ఓడిపోతే రాష్ట్రం వదిలి పరారై తెలంగాణకి వెళ్ళిపోతారు అని పదేపదే ఎద్దేవా చేశారు జగన్ మోహన్ రెడ్డి. తీరా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?
వైయస్ జగన్మోహన్ రెడ్డి వారానికి మూడు రోజులు బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ కు పారిపోతూ ఉంటారు. అక్కడ విలాసాలలో మునిగితేలి.. ఏదైనా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గానీ.. ఎవరైనా చనిపోయినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతూ గడుపుతున్నారు. బెంగళూరులో ఉన్నంతకాలం ఒక్క రాజకీయ కార్యకలాపం ఉండదు. పార్టీ నాయకులు ఎవరికీ కూడా కనీసం ఆయన ప్యాలెస్ లోకి అనుమతి కూడా ఉండదు. అపాయింట్మెంట్ కూడా ఉండదు. తాడేపల్లి నుంచి నాయకులకు స్క్రిప్టులు మాత్రం వెళుతుంటాయి వాళ్ళందరూ ప్రెస్మీట్లు పెడుతుంటారు.

జగన్ ట్వీట్లు మాత్రమే పెడుతుంటారు. ప్రెస్ మీట్ లు కూడా చాలా అరుదు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్లు తమకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్టు చేతికి వచ్చినా సరే ఏపీలో ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టరు. ఆయన హైదరాబాదు దాటి కదలరు. హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మాత్రమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వాన్ని తిడుతుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఎందుకు? కనీసం నిందలు వేయడానికైనా వారు రాష్ట్రానికి రాలేరా? ఏపీ గడ్డమీద నిల్చుని ఏపీ ప్రభుత్వాన్ని తిట్టాలంటే భయపడుతున్నారా? లేదా, ఏపీలోకి అడుగు పెట్టాలంటే మొహం చెల్లని పరిస్థితుల్లో ఉన్నారా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి! హైదరాబాదులో బుగ్గన విలేకరుల సమావేశం పెడితే పత్రికల వాళ్ళందరూ ఆయనను తిట్టుకుంటున్నారు. ఆ వార్తను తాము రాసి ఏపీ ఎడిషన్ కోసం పంపడం అనేది ఒక అదనపు భారం అవుతున్నదని వాపోతున్నారు. ఆయనకు ఏపీలో మొహం చెల్లని దానికి ఇంట్లో కూర్చోవచ్చు కదా హైదరాబాదులో ప్రెస్ మీట్ లు పెట్టడం ఎందుకు అని తమలో తాము చర్చించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories