ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వడివడిగానే అడుగులు వేశారు. అంతే చురుగ్గా ఉన్నత పదవులకు ఎదిగారు.. కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీనిర్వహిస్తున్న తీరుతో విసిగిపోయి.. ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదనే అనుమానం బలపడిపోయి.. ఆమె పూర్తిగా రాజకీయ జీవితంనుంచి వైదొలగనున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజకీయ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆమెలో వైరాగ్యం పెంచినట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు.
మేకతోటి సుచరిత సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. తొలుత ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రత్తిపాడు నుంచి గెలిచారు. రాజశేఖర రెడ్డి మరణం.. ఆ తర్వాతి పరిణామాల్లో మేకతోటి సుచరిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. 2019లో మాత్రం వైసీపీ తరఫున నెగ్గిన సుచరితకు జగన్ హోంశాఖ అప్పగించారు. అయితే జగన్ పాలనలో పేరుకు హోంమంత్రిగా ఉన్నప్పటికీ.. ఆ శాఖలో ఏ నిర్ణయం కూడా ఆమె అనుమతితో, ఆమె కనుసన్నల్లో జరిగేది కాదని.. తన ప్రమేయం ఏమీ ఉండదనే అసంతృప్తి ఆమెలో ఉండేదని అంటుంటారు.
రెండున్నరేళ్లు గడిచిన తర్వాత.. మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించిన జగన్మోహన్ రెడ్డి మేకతోటి సుచరితను కూడా పక్కన పెట్టారు. అప్పట్లోనే వైరాగ్యానికి గురైన సుచరిత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా గుసగుసలు వచ్చాయి. అయితే ఆమె రాజీనామా వంటి తీవ్ర నిర్ణయం తీసుకోకుండా జగన్ సర్ది చెప్పారు. తర్వాత పరిణామాల్లో ఆమెకు గుంటూరు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కూడా అప్పగించారు.
2024 ఎన్నికలు వచ్చేసమయానికే సుచరితకు మళ్లీ రాజకీయాల్లో పోటీచేయడం గురించి ఆసక్తి లేకుండాపోయింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన భర్త దయాసాగర్ కు బాపట్ల ఎంపీ టికెట్ కావాలని ఆమె అభ్యర్థించారు. అయితే అందుకు జగన్ నిరాకరించారు. అలాగని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సుచరితను జగన్ తాడికొండ నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆమె అయిష్టంగానే పోటీచేశారు గానీ ఫలితం దక్కలేదు. ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్న మేకతోటి సుచరిత ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ సన్యాసం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని అనుకుంటున్నారు. వైసీపీలో మాత్రం ఆమె కొనసాగే అవకాశం ఏమాత్ంర లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.