భారతీయ జనతా పార్టీకి ఏమైంది. తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీచేస్తున్నది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా అతిపెద్ద ద్రోహాలు తలపెట్టిన పార్టీనే అయినప్పటికీ.. ఈ దఫా తెలుగుదేశాన్ని, జనసేనను కలుపుకుని.. పోటీచేయడం వల్ల అటు ఎమ్మెల్యేలుగా గానీ, ఎంపీలుగా గానీ.. ఏపీలో తమ అస్తిత్వాన్ని చూపించుకోగల పాజిటివ్ వేవ్ తో అడుగు వేస్తోంది. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే.. భారతీయ జనతా పార్టీ కూటమి ధర్మాన్ని పాటిస్తున్నదా? లేదా? అనే అనుమానం అనేకమందికి కలుగుతోంది.
ఇవాళ ఎన్డీయే కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కవర్ పేజీ మీద చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఫోటొలు మాత్రమే ప్రచురించారు. మోడీ ఫోటో గానీ, బిజెపి జాతీయ సారథి నడ్డా ఫోటోగానీ, ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి ఫోటో గానీ లేకుండా పోయింది. బిజెపినే వద్దన్నది అనే మాట వినిపిస్తోంది. పైగా ఈ మేనిఫెస్టోలో జనసేన సూచించిన హామీలను కూడా అనేకం జత చేశారు. అయితే బిజెపి మేనిఫెస్టోకు తమ తరఫున కొన్ని సూచనలను కూడా ఇవ్వలేదు. అలాంటి ప్రస్తావన అందులో ఎక్కడా లేదు.
కనీసం మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి వారు రాలేదు. కేంద్రం తరఫున పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాత్రమే వచ్చారు. ఆయన కూడా మేనిఫెస్టోను పట్టుకుని ఫోటో దిగడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వ్యవహారాలు ప్రజల దృష్టిలో కూటమి పార్టీల ఐక్యత మీద సందేహాలు రేకెత్తిస్తాయనే కనీస స్పృహ భాజపాకు లేదా అనేది ప్రశ్న.
ఈ పార్టీల మధ్య ఓటు బదిలీ పద్ధతిగా జరిగి, అన్ని పార్టీలు విజయం సాధించాలని వారు కోరుకుంటున్నారు. కానీ బిజెపి వ్యవహారం గమనిస్తుంటే.. వారు కూటమి ధర్మాన్ని పాటించడం లేదని, ప్రజల్లో వీరు పలుచనకాకుండా.. జాగ్రత్త పడాలని తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.