గోరంట్ల అంత ఓవర్ యాక్షన్ చేసింది అందుకేనా?

పోలీసుగా ఉంటూ జేసీ బ్రదర్స్ ను నానా బూతులు తిట్టినందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసన్నుడు కావడం వలన.. టికెట్ దక్కించుకుని హిందూపురం ఎంపీగా నెగ్గిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్. ఒక టర్మ్ పదవిని వెలగబెట్టి.. మధ్యలో ఒక మహిళకు నగ్నంగా వీడియో కాల్ చేసి, రొమాంటిక్ ముచ్చట్లు పెట్టడం.. అదికాస్త లీక్ కావడంతో.. పార్టీని కూడా భ్రష్టు పట్టించడం జరిగింది. 2024 ఎన్నికల్లో మాధవ్ ను పక్కన పెట్టేసి జగన్ శాంతకు టికెట్ ఇచ్చారు. మాధవ్ అదృష్టం కొద్దీ ఆమె ఓడిపోయింది. రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ తనకు టికెట్ దక్కేలాగా.. పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాగ? ఏదో ఒకటి ప్రత్యేకంగా చేసి పార్టీ అధినేత కళ్లలో పడితేనే కదా అలా కుదురుతుంది- అని ఆయన ఫిక్సయినట్లుంది. అందుకే ఇంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

వైఎస్ భారతి మీద అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. అక్కడినుంచి గుంటూరు తీసుకువెళ్లే క్రమంలో.. అనూహ్యంగా గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి పోలీసు వాహనాన్ని వెండించాడు. దానిని అడ్డగించి.. కిరణ్ పై దాడి చేసి కొట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకోబోగా వారి మీద కూడా దౌర్జన్యం చేశాడు. మొత్తానికి అతడిని వదిలించుకుని పోలీసులు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆ ప్రాంగణంలో కిరణ్ మీద మళ్లీ దాడికి ప్రయత్నించాడు గోరంట్ల! విసిగిపోయిన పోలీసులు అతడిని, అనుచరుల సహా అరెస్టు చేశారు.

గోరంట్ల చేసిందే ఓవరాక్షన్ అని అంతా అనుకుంటుండగా.. ఇలాంటి ఓవరాక్షనే కావాలి.. ఇలా చేసే వాళ్లనే మేం సపోర్టు చేస్తాం.. అన్నట్టుగా.. ఆయనను పోలీసులు తీసుకువెళ్లిన వెంటనే.. అంబటి రాంబాబు తదితర వైసీపీ నాయకులు పోలీసు స్టేషనుకు కూడా వచ్చారు. పోలీసుల్లోనే ఒక వైసీపీ కోవర్టు లాంటి అధికారి.. కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తీసుకువెళుతున్న సమాచారం పార్టీ వారికి అందించాడని, దానిని బట్టి ఆ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించి ఈ గందరగోళం సృష్టించాడని అంటున్నారు.

అయినా.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి, భారతిని దూషించిన వాడి మీద దాడిచేస్తే తనకు ఎక్కువ మార్కులు పడతాయని.. ఆల్రెడీ పార్టీ లూప్ లైన్ లో ఉన్న ఈ ప్రజాదరణ లేని మాజీ ఎంపీ తలపోసినట్టుగా ఉంది. అయితే ఇలాంటి దుడుకు చర్యలకోసం జగన్ ఎందరినైనా వాడుకోవచ్చు గాక.. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత.. తాను చేయించుకునే సర్వేల్లో గెలుపుగుర్రంగా తేలితే తప్ప టికెట్ ఇవ్వరు అని తెలుసుకోవాలి! ప్రజల్లో తన ప్రతిష్ట పెంచుకునే పనులు చేయకుండా.. జగనన్న ప్రాపకం కోసం అతి వేషాలు వేస్తే పోలీసు కేసులు తప్ప మరేం దక్కవని గోరంట్ల మాధవ్ గ్రహించాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories