ప్రజలను ఒక్క ఛాన్స్ అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఒకే ఒక్క నిర్మాణం రుషికొండ ప్యాలెస్ మాత్రమే. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘విలాసవంతమైన అతిథి భవనాల నిర్మాణం’ అనే ముసుగులో తన కోసం విశాఖలో నివాస భవనాలను కట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికారం నుంచి దిగిపోయే ముందు ఆయన లాంఛనంగా ఆ భవనాలను ప్రారంభించారు. ఒక్క రోజు కూడా అక్కడ నివాసం ఉండలేదు. అయితే నిర్మించి ఏడాది కూడా పూర్తికాకముందే ఆ భవన నిర్మాణంలో లోపాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. సీలింగ్ ఊడిపోవడం, పైకప్పు దెబ్బతిని లోపలకు నీళ్లు లీకవుతుండడం వంటి వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం ఏ పని చేసినా అందులో వాటాలను స్వాహా చేయడమే అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన నివాసం కోసం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన భవనాలను కూడా శ్రద్ధగా నాణ్యంగా పూర్తి చేయలేకపోయారా అనే విమర్శ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.
విశాఖపట్నం లో ‘సేనతో సేనాని’ కార్యక్రమం కోసం మూడు రోజులు క్యాంపు చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులతో కలిసి విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలోని అనేక వైఫల్యాలు బయటపడ్డాయి. ఒక ఏడాది గడవకముందే నిర్మాణం అక్కడక్కడ అప్పుడే దెబ్బతింటున్నని పవన్ కళ్యాణ్ గమనించారు. అలాగే ఏడాదిగా వాడుకోలో లేకపోవడం వలన విద్యుత్తు ఉపకరణాలన్నీ దారుణంగా దెబ్బతిన్న వైనం కూడా గుర్తించారు. నిర్వహణ లేక సముద్రపు ఒడ్డున ఉన్న ఈ భవనాలు గాలికి దారుణంగా దెబ్బతింటున్న సంగతిని కూడా గమనించారు. నిర్వహణ లేకపోవడం వలన జరుగుతున్న నష్టం కంటే, అసలు నిర్మాణమే ఘోరంగా ఉండడం వలన బయటపడిన నష్టాలు అనేకం రుషికొండ ప్యాలెస్ లో వెలుగు చూసాయి.
జగన్మోహన్ రెడ్డి దాదాపు 453 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో తన నివాసం కోసం రుషికొండ మీద ఈ భవనాలను నిర్మించుకున్నారు. తనకోసం ఒకటి, ఇద్దరు కూతుర్ల కోసం మరో రెండో భవనాలు అన్నట్లుగా వీటిని నిర్మాణం జరిగింది. అక్కడి వరకు ఒక ప్రాంగణం అన్నట్లుగా అతిపెద్ద ప్రహరీ గేటును కూడా ఏర్పాటు చేశారు. దాని వెలుపల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఉన్నట్లుగా చిన్న చిన్న సమావేశాలు, కార్యాలయాలు నిర్వహించే మరొక భవనాన్ని నిర్మించారు. ఇదంతా కూడా సీఎం నివాసం, క్యాంపు ఆఫీసు సెటప్ అని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. అయితే జగన్ తన నివాసం కోసం డబ్బులు తగలేస్తున్నారు అనే విమర్శలు వచ్చిన ప్రతిసారి అవి టూరిజం శాఖ కోసం నిర్మిస్తున్న భవనాలు, వివిఐపీలు వచ్చినప్పుడు వారికి కేటాయించడానికి అని బుకాయిస్తూ రకరకాల మాయమాటలు చెప్పారు. తీరా ఇప్పుడు కనీసం వాటిని కూడా నాణ్యంగా నిర్మించలేకపోయారు అని విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణం మీద తన ఐదేళ్ల పదవీకాలంలో ఏ మాత్రం దృష్టి సారించకపోవడమే మంచిది అయిందని.. ఆయన ఆ నిర్మాణాలను చేపట్టి ఉంటే అవి కూడా ఈపాటికి కుప్పకూలి ఉండేవేమో అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.