జగన్మోహన్ రెడ్డి తనను తాను పాండవులకు ప్రతినిధిగా, అర్జునుడిగా ఊహించుకుని ఆ పాత్రకు ఫిక్స్ అయిపోయారు. తనకు ప్రత్యర్ధులుగా ఎవరు ఉంటే వారు కౌరవులన్నమాట! మొన్న మొన్నటిదాకా ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి సభలోనూ ఇదే ప్రస్తావన తెచ్చేవారు. ‘ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర సంగ్రామం. వాళ్లందరూ కలసికట్టుగా గుంపుగా వచ్చి కౌరవుల్లాగా పోరాడుతున్నారు. మీ జగన్ ఒక్కడూ అర్జునుడి లాగా ఎదురు నిలుస్తున్నాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మమే గెలుస్తుంది. దేవుడు మనవైపే ఉన్నాడు’ అంటూ రకరకాల చిలక పలుకులు పలికారు జగన్మోహన్ రెడ్డి. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి అతి ఘోరమైన పరాజయం ఆయనను పలకరించింది.
ముందే చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తనను తాను అర్జునుడి పాత్రకి ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఈ ఎన్నికల్లో ఓడిపోయారు కనుక, ‘ది కురుక్షేత్రం కాదని కౌరవ సభలో పాచికల ఆట’ అని అభివర్ణిస్తూ ఆయన కొత్త పాట అందుకున్నారు. శకుని వచ్చి పాచికలు విసిరేసరికి ధర్మం అంతా తలకిందులైపోయి కౌరవులు విజయం సాధించారని ఆయన చెబుతున్నారు.
ఇంతకూ పాచికలు ప్రయోగించి కౌరవులను గెలిపించిన శకుని లాగా ఆయన పోలుస్తున్నది ఎవరిని? ప్రధాని నరేంద్ర మోడీ నేనా!! అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులు పెట్టుకుని జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా- ఎన్నికల సమరం ఎదుర్కొనేందుకు చాలా కాలం కిందటే ఒకటయ్యాయి. ఆ కూటమికి కొత్త బలం జోడించే లాగా సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి చేరినది బిజెపి మాత్రమే. అలాగే ఈవీఎంలలో గోల్‌మాల్ ద్వారా తెలుగుదేశం గెలిచిందని జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ నరేంద్ర మోడీతో ముడిపెట్టి చేస్తున్నారు.
కేవలం అందుకోసమే కేంద్రంలోని బిజెపితో బాబు పొత్తు పెట్టుకున్నారని కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. ఈవీఎంలలో మాయ చేయడాన్నే- పాచికల ప్రయోగం తో పోలుస్తున్నట్టుగా ఆయన చెబుతున్న మాటలు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీని శకుని కింద అభివర్ణిస్తున్నట్లుగా ప్రజలకు అర్థమవుతుంది. పాండవుల వైపు కృష్ణుడు ఉన్నా కూడా గెలవలేకపోయారని ఆయన అనడం ఇంకో తమాషా! ఇంతకూ వైసీపీలో ఆ కృష్ణుడు ఎవరో మరి? బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అంటున్నారా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
ప్రధాని మోడీని శకునిగా అభివర్ణించిన జగన్ దూకుడును ఆయన పార్టీ నాయకులు కూడా అందిపుచ్చుకుంటున్నారు. గురువారం నాడు పార్టీ తరఫున పోటీ చేసిన వారందరితోనూ జగన్ నిర్వహించిన సమావేశం పూర్తయిన తర్వాత, బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇదే శకుని సామెతలను, శకుని ఉదాహరణను తమ ఓటమికి కారణంగా ప్రస్తావించడం గమనార్హం. తననకు శకునితో పోలుస్తున్న సంగతిని ప్రధాని మోడీ గుర్తిస్తే గుస్సా అవుతారేమోనని ప్రజలు భావిస్తున్నారు.