జోగి ఒక్కడేనా.. చంపమంటూ జగన్ ప్రేరేపించారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యర్థుల మీద దాడులకు ఏ రకంగా బరితెగించారో అందరూ గమనించిన విషయాలే. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి సందర్భాలు మాత్రమే కాదు.. గ్రామాల్లో వివాదాలు రేకెత్తిన ప్రతిసారీ తెలుగుదేశం వారి మీద దాడి చేయడం, బాధితుల మీదనే కేసులు పెట్టి వేధించడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. ఆ క్రమంలోనే 2021 సెప్టెంబరులో చంద్రబాబునాయుడు ఇంటిమీద, తెలుగుదేశం పార్టీ కార్యాయాల మీద బీభత్సంగా దాడులు చేశారు. జోగిరమేష్ ఆధ్వర్యంలో వచ్చిన వైసీపీ గూండాలు.. చంద్రబాబు ఇంటివద్ద ఉన్న వారినందరినీ చితక్కొట్టి విధ్వంసం సృష్టించారు. అప్పటి దాడులకు సంబంధించి.. ప్రత్యక్ష సాక్షి తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రజలందరినీ కూడా విస్మయపరుస్తోంది.

తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక్కరినైనా తల తీసి చంపేస్తే.. అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదలి పారిపోతారు.. ఇక మళ్లీ ఆంధ్రాకు రారు.. అని పెద్దగా అరుస్తూ జోగి రమేష్ తను తీసుకువచ్చిన గూండాలను రెచ్చగొట్టినట్టుగా తెలుస్తోంది. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, ఆ సమయానికి చంద్రబాబును కలవడానికి వెళ్లి అక్కడే ఉన్న తన స్నేహితులు వారిని ఎంతగా వారించినా, కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పినా పట్టించుకోకుండా తమ మీద దాడిచేసి తీవ్రంగా కొట్టారని.. ఉండవిల్లికే చెందిన ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

జగన్ ప్రేరేపణతోనే అప్పట్లో చంద్రబాబు ఇంటిమీద దాడి జరిగినట్టు పుకార్లు వచ్చాయి. జగన్ కళ్లలో ఆనందం చూడడం లక్ష్యంగా జోగి రమేష్ తన అనుచర గూండాలను తోలుకు వచ్చి రెచ్చిపోయారు. అప్పట్లో దాడులకు గురైన వారు కేసులు పెడితే పోలీసులు పట్టించుకోలేదు. ఎదురు వారిమీదే కేసులు బనాయించారు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, విచారణ సాగుతుండగా.. జోగిరమేష్ తెదేపా కార్యకర్తల్ని చంపేయమంటూ ఏ స్థాయిలో రెచ్చగొట్టారో అర్థమవుతోంది. ఇంత బీభత్సం చేసినందుకే జోగి రమేష్ కు ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ అన్వయించుకుంటే.. తెదేపా వారిని చంపేదాకా వెళ్లమని అన్నది జోగిరమేష్ మాత్రమేనా? అతని వెనుక జగన్ కూడా అదే స్థాయిలో రెచ్చగొట్టి పంపారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories