జగన్ ధ్వంసరచనలో మరీ అంత దారుణాలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క చాన్స్ కావాలంటూ అధికారంలోకి వచ్చి.. అయిదేళ్లపాటూ రాష్ట్రాన్ని ఎంతటి విధ్వంసం వైపు నడిపించారో అందరికీ తెలుసు. పథకాల పేరుతో ఓటుబ్యాంకు నిర్మాణానికి పథకాల పేరుతో జనానికి డబ్బులు పంచిపెట్టడం అనే డ్రామా తప్ప.. నిర్మాణాత్మకంగా ప్రజల జీవితాలను బాగు చేయడానికి ఆయన చేసిన పని లేదు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారు. అంతకుముందు చంద్రబాబు పాలనలో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలను, పెట్టుబడిదారులను వెనక్కు వెళ్లగొట్టారు. తెలుగుదేశం అనుకూలురనే అనుమానం వస్తే చాలు.. చంద్రబాబుకు కీర్తి వస్తుందనే భయం ఉంటే చాలు.. నడుస్తున్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడానికి కుట్రలుచేశారు. అలాంటి వాటిలో భాగంగానే సింగపూర్ ను కూడా భయపెట్టి.. రాష్ట్ర పునర్నిర్మాణంలో అనేక విధాలుగా భాగస్వాములు కావడానికి పూనుకున్న సింగపూర్ ప్రభుత్వాన్ని, సంస్థలను వెనక్కు వెళ్లగొట్టారు. ఇప్పుడిప్పుడే.. జగన్ చేసిన గాయాల నష్టాన్ని పూడ్చడానికి చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోంది. ఒకవిడత సింగపూర్ వెళ్లి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు వెల్లడిస్తున్న సంగతులు.. జగన్ దుర్మార్గాల్ని మరింతగా ఎత్తి చూపుతున్నాయి.

అమరావతి నగరానికి రూపకల్పన చేసినప్పుడు చంద్రబాబునాయుడు.. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పట్లో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మాస్టర్ దెవలపర్ గా అసెండాస్ సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థల కన్సార్షియాన్ని ఎంపిక చేశారు. 2017లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. స్థల కేటాయింపునకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉండగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అమరావతి మీద కక్ష కట్టి.. ఆ ప్రాంతాన్నంతా స్మశానంగా మార్చేసే దురుద్దేశంతో అడుగులు వేశారు. ఆ క్రమంలో సింగపూర్ కన్సర్షయాన్ని బెదిరించి.. ఆ ప్రాజెక్టునుంచి వైదొలిగేలా ఒత్తిడి చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధి సమూలంగా ఆగిపోయింది.

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఊపిరి వచ్చింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మళ్లీ చేపట్టనున్నట్టుగా చంద్రబాబు ఆల్రెడీ ప్రకటించారు. సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడి వివిధ సంస్థలు, పెట్టుబడిదారుల్లో ఏపీ పట్ట మళ్లీ విశ్వాసాన్ని పాదుగొల్పడానికి ప్రయత్నించి వచ్చారు. ఈ క్రమంలో వెల్లడవుతున్న మరో చేదు నిజం ఏంటంటే.. జగన్ హయాంలో ఆయన దళాలు.. సింగపూర్ కు వెళ్లి మరీ అక్కడి సంస్థలను బెదిరించి వచ్చారని, ఏపీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారని! కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఈ విషయం చెప్పారు. సింగపూర్ వెళ్లి అక్కడి మంత్రులను బెదిరించి మరీ ఏపీ నుంచి తప్పుకునేలా చేసిన ఘనత జగన్ దళాలు మూటగట్టుకున్నాయి. ఇప్పుడు నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. సింగపూర్ నుంచి మళ్లీ పెట్టుబడులు, సంస్థలు ఏపీకి వస్తే.. అది పూర్తిగా చంద్రబాబునాయుడు కష్టం ఫలితమే అని అనుకోవాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories