సొంత పార్టీకి జగన్ సమాధి కడుతున్నారా?

కొన్ని నిర్ణయాలు చారిత్రక తప్పిదాలుగా నిరూపణ అవుతుంటాయి. కాలక్రమంలో అవి ఎప్పటికీ దిద్దుకోలేనంత పెద్ద తప్పులుగా కూడా తేలుతుంటాయి. కొన్ని వ్యక్తిగత ఈగోల వల్ల చాలావరకు తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో అయితే.. జనం నాడిని అంచనా వేయడంలో అవగాహన లేకపోవడం, ఎవరైనా చెబితే వినే అలవాటు లేకపోవడం వల్ల కూడా తప్పుడు నిర్ణయాలు దొర్లుతాయి. ఆ తప్పుడు నిర్ణయాలు.. సరిదిద్దలేనంత పెద్ద నష్టాన్ని కలిగించిన తర్వాత.. ఇక చేయడానికి మరేం ఉండదు. అదే పరిస్థితి ఎదురవుతోంది.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి!

ప్రజల్లో తన పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్నదనే సంగతిని జగన్ కు ఎవరూ చెప్పలేదో, చెబితే ఆయన నమ్మలేదో మనకు తెలియదు. కానీ.. వ్యతిరేకత ఉన్నదని మాత్రం గ్రహించి.. అదంతా అభ్యర్థుల మీదికి నెట్టడానికి వారిని అటు ఇటు మార్చారు. చాలా మందికి టికెట్లు నిరాకరించి కొత్తవారికి ఇచ్చారు. ఓటమి మాత్రం తప్పలేదు. అప్పట్లో పార్టీ నాయకులందరూ గట్టిగా వ్యతిరేకించినా.. జగన్ ఒంటెత్తు పోకడలతో దూసుకెళ్లి సగం స్థానాలను చేజేతులా ఓడించారు.

ఇప్పుడు కూడా ఆయన తీసుకుంటున్న ఒక నిర్ణయం పార్టీకి ప్రమాదకరంగా మారుతోంది. ప్రకాశం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించనుండడం పట్ల ఆ జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిజానికి చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీచేయించడం మీదనే పార్టీలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఎవ్వరి మాటా వినకుండా జగన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. జిల్లాలో సమర్థులు లేరా.. చెవిరెడ్డిని వలసతెచ్చి పార్టీ సారథ్యం అప్పగించాలా? అని ప్రశ్నిస్తున్నారు.

జగన్ ఒంటెత్తు పోకడలే పార్టీని ఇటీవలి ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురిచేశాయి. ఇప్పటికీ ఆయన పార్టీలోని కీలక నాయకుల మాటలకు విలువ ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతే.. క్రమంగా పార్టీ సమాధి అవుతుందని పలువురు అంటున్నారు. జగన్ తాను స్థాపించిన పార్టీకి తానే సమాధి కడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సొంత వారే విమర్శిస్తున్నారు. మరి వారి హితవాక్యాలు జగన్ చెవికెక్కుతాయో లేదో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories