మోపిదేవి విషయంలో జగన్ భయపడుతున్నారా?

‘‘అవకాశవాదులు మాత్రమే వెళ్లిపోతున్నారు. పోయే వాళ్లను పోనివ్వండి. మనం కొత్త నాయకులను తయారుచేసుకుందాం. వెళ్లిపోయే వాళ్లతో మనకు ఇబ్బందేం లేదు’’ ఇలాంటి మేకపోతు గాంభీర్యపు డైలాగులు జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా సార్లు వల్లించారు. కానీ మొదటిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయిన మోపిదేవి వెంకటరమణ పదవిని కూడా వదులుకుని తెలుగుదేశంలో చేరడంపై ఆయన బాధపడుతున్నారు. మోపిదేవికి ఎన్నో చేశామని.. అయినా ఆయన పార్టీ వీడి వెళ్లడం బాధగా ఉన్నదని జగన్ అనడం ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశం అవుతోంది. అయితే.. నిజానికి ఇది బాధపడడం కాదని, మోపిదేవి పార్టీ మారడం గురించి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆశ్చర్యం ఎందుకంటే.. సొంత మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వదలి జనసేనలో చేరినప్పుడు కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. పోయేవాళ్లను పోనివ్వండి అనే డైలాగులే పలికారు. కానీ మొదటిసారిగా మోపిదేవి వెంకటరమణ వెళ్లిపోవడం పట్ల భిన్నంగా స్పందించారు.

‘‘మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయనకు అన్నీ మంచే చేశా. ఎక్కడా తక్కువ చేయలేదు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవి కూడా ఇచ్చా. మండలిని రద్దు చేద్దామని అనుకున్నప్పుడు తన పదవి పోతుందని ఆయన అడగ్గానే రాజ్యసభకు పంపా. అయినా మోపిదేవి పార్టీని వీడివెళ్లారు.. బాధాకరం’’ అని జగన్ రేపల్లె కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ బాధ అనేది ఆయనలోని భయానికి చిహ్నంగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్ సాగించిన క్విడ్ ప్రోకో దందాలలో మోపిదేవి కూడా భాగస్వామి. జగన్ అక్రమార్జనలకు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. జగన్ పాపాల కారణంగా మోపిదేవి వెంకటరమణ కూడా జైలుకు వెళ్లారు. పైగా జగన్ ఎన్నెన్ని అక్రమార్జనలకు పాల్పడ్డారో.. ఏయే మార్గాల్లో తప్పుడు పనులు చేశారో.. అన్నీ మోపిదేవికి తెలుసు. కాబట్టే.. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా వెంటనే ఎమ్మెల్సీనిచేసి మంత్రిపదవి కట్టబెట్టారు. మండలి రద్దు చేయాలనుకున్నాక.. ఆయనను దువ్వడానికి రాజ్యసభ ఎంపీ చేశారు. ఆరకంగా ఆయన తనకు వ్యతిరేకంగా తయారైతే ప్రమాదం అని భయపడి.. జాగ్రత్తలు తీసుకున్నారు. పదవులరూపేణా బిస్కట్లు వేస్తూ వచ్చారే తప్ప పార్టీలో గానీ నియోజకవర్గంలో గానీ కనీసప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించారు. అందుకే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడి వెళ్లడం జరిగింది.

ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరిన తర్వాత.. తనమీద ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో ఆయన ఎక్కడ వారికి ఆధారాలు అందిస్తారో, అప్రూవర్ గా మారుతారో అనే భయం జగన్ లో ఉంది. మోపిదేవి నోరు విప్పితే చాలు.. తన గుట్టు మొత్తం బయటపడుతుందని ఆయన భయడపడుతున్నట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు. మోపిదేవి గండం నుంచి ఆయన ఎలా బయటపడతారో  చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories