తన ఇంటి చుట్టూ 30 అడుగుల ప్రహరీ గోడ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భయం! తన చుట్టూ వందల మంది పోలీసులు లేకపోతే కూడా జగన్ కు భయం!పురాతన కాలంలో తన మీద కోడికత్తితో దాడి జరిగింది గనుక.. తన ప్రాణాలకు రాబోయే రోజుల్లో కూడా ముప్పు ఉన్నదని ఆయన ఆందోళన చెందుతున్నారు. స్థాయిని బట్టి మాత్రమే భద్రత కల్పించే నిబంధనలు ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. తనకు అరివీర భయంకరమైన భద్రత ఉండాలని కోరుకుంటున్నారు. తాను ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అనే సంగతి ఆయన మర్చిపోయి.. భద్రత కోసం ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేయడం విశేషం.
జగన్ కు ఇప్పటికీ 59 మందితో భద్రత కొనసాగుతోంది. అంతమంది పోలీసులు ఆయనకు చాలుతున్నట్టు లేదు. సీఎం అయ్యాక 800 మందితో భద్రత ఏర్పాటుచేసుకున్న జగన్ కు ఇప్పుడు ఈ సంఖ్య చాలా తక్కువగా కనిపించడంలో చింత లేదు. తన మరియు తన కుటుంబసభ్యుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, ప్రత్యేక దళాన్ని తయారుచేసుకున్న చరిత్ర జగన్ ది. ఆలెవెల్లో లేకపోవడం అవమానంగా ఫీలవుతున్నట్టున్నారు.
ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు, అంటే జూన్ 3 వ తేదీ నాటికి, తనకు ఎలాంటి భద్రత ఉండేదో అదే పునరుద్ధరించాలని జగన్ హైకోర్టును కోరడం విశేషం. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగినదని, ఆ లెక్కింపులో ప్రజలు తనను ఓడించి, సాధారణ ఎమ్మెల్యేగా మార్చేశారని, తాను ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని జగన్ మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉంటూ.. ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించాలని కోరడమే పెద్ద కామెడీగా పలువురు భావిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు తన మీద కోడికత్తి దాడి జరిగింది గనుక.. తన ప్రాణాలకు అపాయం ఉన్నదని.. తక్షణం భద్రత పెంచాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడుకు తన ప్రభుత్వం భద్రత తగ్గించిన సంగతిని ఆయన మర్చిపోయారో ఏమో తెలియడం లేదు. జగన్ తన మీద కోడికత్తి దాడి గురించి చెబుతున్నారు. చంద్రబాబు మీద నక్సలైట్లు ఏకంగా క్లెమోర్ మైన్స్ తోనే దాడిచేశారు. చంపాలని చూశారు. అయినా సరే.. చంద్రబాబు భద్రతను తగ్గించి తన దుర్మార్గాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇలా కామెడీ కోరికలు కోరుతున్నారు.