జగన్ ను ఇరికించడమే మల్లాది విష్ణు లక్ష్యమా?

మల్లాది విష్ణు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ఆయన ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. విజయవాడకే చెందిన కీలక నాయకుడు ఆయన. విజయవాడను వరదలు ముంచెత్తిన తర్వాత ఆయన కూడా కొంత మేర సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరద బాధితులకోసం ప్రకటించిన కోటి రూపాయలతో కొన్ని అన్నం ప్యాకెట్లు,  కొన్ని వాటర్ బాటిళ్లు  ఆ పార్టీ నాయకులు అక్కడక్కడా పంచిపెట్టారు.

అలా పార్టీ డబ్బుకు లెక్కా పక్కా లేకుండా షో చేసిన వైసీపీ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. సదరు మల్లాది విష్ణు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను గమనిస్తే.. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికే ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.  ఆయనకు అర్థమవుతున్నదో లేదో గానీ.. ఆయన డిమాండ్ చేస్తున్న ప్రశ్నలు.. అల్టిమేట్ గా జగన్ ను నిందితుడిగా తేల్చే అవకాశం ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

మల్లాది విష్ణు తాజాగా  మీడియా ఎదుట మాట్లాడుతూ వరద సహాయక చర్యలు అన్ని ప్రాంతాలకు అందడం లేదని ఆరోపణలు గుప్పించారు. వరద విజయవాడను ముంచేసి ఎనిమిది రోజులు అవుతున్నా.. ప్రభుత్వంలో ఇంకా చలనం లేదని విష్ణు చెబుతున్న మాటలను గమనించి ప్రజలు నవ్వుకుంటున్నారు.
 
ఒకవైపు బుడమేరు కాలువకు పడిన మూడు అతిపెద్ద గండ్లను కూడా పూర్తిగా పూడ్చేసి.. ప్రస్తుతానికి విజయవాడ నగరాన్ని భద్రమైన స్థితిలోకి తీసుకువెళ్లి.. ప్రభుత్వం ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంటే.. మల్లాది విష్ణు ఇప్పటిదాకా చలనమే లేదని అనడం నిజంగా కామెడీనే. ఇంత భారీ నష్టానికి కారకులెవరో తేల్చాలని మల్లాది అంటున్నారు.

ఆ మాటకొస్తే.. భారీ వర్షాల గురించిన సమాచారం ముందుగానే ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈ భారీ విపత్తుకు కారణం కేవలం బుడమేరు గండ్లు పడడం మాత్రమే. ఆ గండ్లకు బాధ్యుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆ విషయాన్ని వరద ముప్పు వచ్చిన తొలిరోజు  నుంచి అందరూ చెబుతూనే ఉన్నారు. బుడమేరు నిర్వహణ పనులకు చంద్రబాబునాయుడు 400 కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తే.. జగన్ అధికారంలోకి రాగానే ఆ పనులను రద్దుచేసిన సంగతి ఇప్పుడు తెరమీదికి వస్తోంది.

భారీవర్షాలకు మాత్రమే పరిమితం కావాల్సిన నష్టం ఇంతటి విపత్తుగా మారడానికి జగన్ వైఖరి కారణమని అందరూ గుర్తించారు. మల్లాది విష్ణు తన డిమాండు ద్వారా.. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నారని, ఆయన వైఫల్యాల్ని ప్రజలు చర్చించుకునేలా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories