బుకాయింపులతో బెయిలు పొందడం అంత ఈజీనా!

ఒకవైపు పోలీసులకు చిక్కకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.. మరొకవైపు బంధుమిత్రులతో పండగలు పబ్బాలు సెలబ్రేట్ చేసుకుంటూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రముఖంగా పోస్టు చేస్తూ.. దమ్ముంటే పట్టుకోండి అన్నట్టుగా పోలీసుల్ని రెచ్చగొడుతూ వ్యవహరిస్తున్నారు.. మరొకవైపు నన్ను అరెస్టు చేసేస్తారో బాబోయ్ నాకు ముందే బెయిలివ్వండి అనే వేడికోళ్లతో హైకోర్టు తలుపు తడుతున్నారు. ఇదంతా ఎవ్వరి సంగతో ఈ పాటికి పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి వ్యవహార సరళి ఇది! ఆయన మీద ఉన్న కేసులను బట్టి.. డైరక్టుగా హైకోర్టుకు ముందస్తు బెయిలు కోసం రావడం సాధ్యం కాదనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కాకాణి గోవర్దన రెడ్డి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో బాగా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ బాగోతం చాలా కాలం కిందటే బయటపడినప్పటికీ.. నిందితుల్లో తన పేరు కూడా చేర్చి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు పూనుకునే దాకా కాకాణి మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతూ వచ్చారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని, అస్సలు భయపడేది లేదని చాలా మాటలు మాట్లాడారు. తనమీద తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను.. తమ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సప్తసముద్రాల అవతల ఉన్నా సరే.. వెతికి పట్టుకొచ్చి బట్టలూడదీయించి కొడతానంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో ఆయనను విచారణకు పిలవడానికి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటేనే.. అయిపూ అజాలేకుండా పరారైపోయారు.
పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా కనీసం వారికి కనిపించడం లేదు. రెండు ఇళ్లూ తాళాలు వేసుకుని వెళ్లారు. హైదరాబాదులో ఉగాది పండగ చేసుకుంటూ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన ఆయన పోలీసులు అక్కడకు వెళ్లేసరికి అక్కడినుంచి కూడా పరారయ్యారు. ఒకవైపు పోలీసులతో దాగుడుమూతలు ఆడుతూనే తనకు ముందస్తు బెయిలు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించడం విశేషం.

ఈ విచారణ సందర్భంగా.. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయి ఉన్నందున.. బెయిలు కావాలన్నా సరే.. ముందుగా సంబంధిత ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని, అక్కడ తిరస్కరిస్తేనే హైకోర్టుకు రావాల్సి ఉంటుందని.. కాబట్టి.. ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని పోలీసుల తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే.. పోలీసులు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు మాజీ మంత్రికి వర్తించవని ఆయన న్యాయవాది అంటున్నారే తప్ప.. ముందుగా ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లాలనే వాదనను వ్యతిరేకించడం లేదు. ఒకే కేసులో మిగిలిన వారి తర్వాత.. కాకాణి కూడా నిందితుడు అయినప్పుడు ఆయనకు మాత్రం ఆ సెక్షన్లు వర్తించకుండా ఎందుకుంటాయి అనేది జనం సందేహం. అందుకే దాగుడుమూతలు ఆడుతూ ముందుగా బెయిలు పొందడం కాకాణికి అంత ఈజీ కాదని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories