ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక విషయాలపై తమ నాయకులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో ఇంకా పెండింగులో ఉన్న నామినేటెడ్ పోస్టులకోసం దాదాపుగా 60 వేల దరఖాస్తులు వచ్చి ఉన్నాయని చంద్రబాబునాయుడు వెల్లడించారు. అయినా ఇంకా పదవుల పంపకం మాత్రం ఎందుకు కార్యరూపం దాల్చడం లేదు.. అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. దానికి జవాబు కూడా చంద్రబాబు మాటల్లోనే దొరుకుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు సిఫారసు చేయకుండా కొంత మంది నేతలు ఆలస్యం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలు విన్న ఎవ్వరికైనా సరే.. అలా ఆలస్యం చేస్తున్న నాయకుల మీద ఆగ్రహం కలుగుతుంది. పార్టీకోసం కష్టపడిన వారిని గుర్తించడం నాయకులకు మరీ అంత కష్టమా అని కార్యకర్తలు, ఆశావహులు నిప్పులు చెరగుతున్నారు.
ఒక ఎమ్మెల్యే గెలిచారంటే.. కేవలం ఆయన ఒక్కడి కష్టం, ఒక్కడి ఘనత మాత్రం కానే కాదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో మంది నాయకులు, సామాన్యకార్యకర్తలు.. చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప.. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం అనేది సాధ్యం కాదు. తమకు ఎమ్మెల్యే పదవి రాకపోయినప్పటికీ.. పార్టీ విజయం కోసం అలా కష్టపడి పనిచేసేవారిలో.. ఎమ్మెల్యేతో సమానమైన స్థాయికలిగిన వారు కూడా ఉంటారు. ఆ తర్వాతి స్థాయికి చెందిన నాయకులు ఎంతోమంది ఉండేవారు. ఒకరు ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఆయనతో సమానంగా కష్టపడిన వారికి రాజకీయంగా దక్కే అవకాశాలు నామినేటెడ్ పోస్టులు మాత్రమే.
అలాంటప్పుడు.. తాము గెలవడానికి కారణమైన, తమ కోసం కష్టపడిన ఇతర నాయకుల్ని గుర్తించి, వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలే త్వరితంగా కదిలి పార్టీ అధినేతను ఆశ్రయించి.. పదవులు దక్కేలా చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీలో కొన్నిచోట్ల వ్యవహారం రివర్సులో ఉన్నట్టుగా ఉంది. ఇంకా కొందరు నాయకులు తమ సిఫారసులు ఇవ్వనేలేదని.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అడగాల్సి వస్తోంది.
అలాంటి నేపథ్యంలో ఆలస్యం చేస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు? అలాంటి వారు పార్టీకి ద్రోహం చేస్తున్నట్టే అనే అభిప్రాయం కార్యకర్తల్లో కలుగుతోంది. నామినేటెడ్ పదవులు అనుభవించకుండా ఆల్రెడీ 9 నెలలు గడచిపోయాయి. ఇది దుర్మార్గం అని కార్యకర్తలు అంటున్నారు. తమ నియోజకవర్గంలో మరొకరికి ఏదో ఒక పదవి దక్కితే.. తమ ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అనే సంకుచిత బుద్ధితో ఎమ్మెల్యేలు ఆలోచించకుండా.. పార్టీకోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కేలా.. అందరూ చురుగ్గా తమ సిఫారసులు ఇవ్వాలని ఆశావహులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.