అసలు చర్యలు మొదలయ్యే వరకూ అందరూ హీరోలే.. కోటలు దాటించే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ అసలు చర్యలు మొదలయ్యాయంటే.. అప్పటికి గానీ వారి అసలు బండారం బయటపడదు. నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి సంగతి ఇప్పుడు అలాగే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన రోజుల్లో రెండో విడతలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. అధికారంలో ఉన్న రోజుల్లో చెలరేగి సాగించిన దందాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆయన మీద ఇప్పటికే వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి.
ఎన్నికేసులు పెట్టుకున్నా తనను ఏమీ చేయలేరని ఆయన విర్రవీగారు కూడా. అయితే తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లే సమయానికి, ముందుగానే సమాచారం అందుకుని.. ఉన్న రెండు ఇళ్లనూ కుటుంబమూ, పరివారమూ సహా ఖాళీ చేసి తాళాలు వేసుకుని పరారీ చిత్తగించారు. అన్ని ప్రగల్భాలు పలికిన ఈ మాజీ మంత్రి.. పోలీసుల నోటీసులకే మరీ అంతగా భయపడిపోతున్నారా.. అని నవ్వుకోవడం ఇప్పుడు ప్రజల వంతు అవుతోంది.
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ గనులను అక్రమంగా తవ్వుకోవడం, అనుమతులు ఒకచోట ఉంటే మరొకచోట తవ్వకాలు జరిపించి.. కోట్లాది రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వాటితో పాటు భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసుల్లో కూడా కలిపి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రి గనుక.. పోలీసులు వస్తున్న సంగతిని.. తన వేగుల ద్వారా ఆయన ముందే గ్రహించినట్లుంది. వారు వెళ్లేసరికి ఆయనకు చెందిన రెండు ఇళ్లకు కూడా తాళాలు వేసి ఉండడం గమనించి పోలీసులే ఖంగుతిన్నారు.
అక్రమమైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి వస్తే కాకాణి అందుబాటులో లేరని, ఆయనకు, ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచాఫ్ వస్తున్నాయని పోలీసులు అంటున్నారు.
కాకాణి గోవర్దన రెడ్డి నిజంగానే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నమ్ముతుంటే గనుక.. కనీసం నోటీసులు అందుకోవడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు.. అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
నిజాయితీగా పనిచేసిన నాయకుడే అయితే.. నోటీసులు అందుకోవాలి.. విచారణకు హాజరు కావాలి.. ఆ పార్టీ వారు అలవాటు చేసుకున్న మాటల ప్రకారం.. కడిగిన ముత్యంలాగా బయటకు రావాలి కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు. కనీసం విచారణకు హాజరు కావడానికి కూడా ఆయన భయపడడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఉన్న రెండు ఇళ్లకు తాళాలు వేసి పరారైతే, తనదీ పీఏదీ కూడా ఫోన్లను స్విచాఫ్ చేసేస్తే.. కేసులనుంచి శాశ్వతంగా తప్పించుకోగలననే భ్రమలో ఏమైనా ఉన్నారా? అనే సందేహాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి.