వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనలోని పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక కొత్త లాజిక్ వెతుక్కున్నారు. ఆ లాజిక్ కు కూడా అర్థం పర్థం లేదు గానీ.. ఆయనకు అలా చెప్పుకోవడం ప్రస్తుతానికి వేరే గతిలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తనలోని పలాయనవాదానికి జగన్ ఒక అందమైన ముసుగు వేసుకుంటున్నారు. ఎలాగంటే..
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డి ని ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటినుంచి దేశవ్యాప్తంగా అందరి మద్దతును కూడగట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియా కూటమి కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అదే సమయంలో తెలుగువ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన రెడ్డికి జగన్ కూడా పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలనే ఒత్తిడి అనేకవైపులనుంచి ఆయన మీద పెరుగుతూ వస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎటూ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములు గనుక.. తెలుగురాష్ట్రాలనుంచి వారి మద్దతు ఆశించే పరిస్థితి సుదర్శన రెడ్డికి ఉండదు. అదేసమయంలో.. ఎన్డీయే కూటమి చేతిలో పరాజయం పాలై.. వారితో శత్రుత్వం కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు అడగడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే తెలుగువారికి గౌరవం ఇవ్వాలని పలువురు జగన్ కు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ జగన్ కు ఫోను చేశారు. అయితే జగన్ మాత్రం.. ‘ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే.. ఎన్డీయే నేతలు మాతో మాట్లాడారని, వారి అభ్యర్థికి మద్దతు కోరితే మాట ఇచ్చానని’ జగన్ చెప్పినట్టుగా ఆపార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘ వ్యక్తిగతంగా మీరంటే గౌరవం, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు మీరు విశేష కృషి చేశారని, అయితే మీకు మద్దతు ఇవ్వలేనని జగన్ చెప్పినట్టుగా’ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవైపు సుదర్శన రెడ్డిని బాగానే పొగుడుతున్నారు. అదేసమయంలో.. తనను ఎవరు ముందు అడిగితే.. వారికే మద్దతు అని అన్నట్టుగా.. ఆయన ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తానని లాజిక్ ప్రకటించడం చాలా చిత్రంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న అనేక అవినీతి కేసుల విషయంలో సేఫ్ జోన్ లో ఉండడం కోసం.. కేంద్రంలోని బిజెపి పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ, వారికి అతివిధేయుడిగా ప్రవర్తిస్తుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. ఎన్డీయే తనకు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ.. వారు ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా తమ పార్టీ వారితో ఓటు చేయించే ధైర్యంలేదని అందరూ అంటుంటారు. ఆ పిరికతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. ముందు వారు అడిగారు గనుక.. వారికి మద్దతిస్తున్నా అనడం చిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు.. ఎవరు ముందు తనను అడిగితే.. వారికే జై కొడతాననడం చాలా లాజిక్ లేకుండా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.