ఒకసారి ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత విన్నవారికీ, మాట్లాడిన వారికి కూడా ఏ అంశం గురించి మాట్లాడారో అర్థం కాకుండా మాట్లాడడం అనేది ఏపీ రాజకీయ నాయకుల్లో బొత్స సత్యనారాయణకు మాత్రమే చేతనైన సంగతి. తాజాగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. విద్యుత్తు చార్జీల పెంపు దగ్గరినుంచి.. షర్మిల చేస్తున్న ఘాటైన విమర్శల వరకు అనేక అంశాల గురించి మాట్లాడారు. ఆ క్రమంలో.. షిప్ లో స్మగ్లింగ్ అవుతున్న పీడీఎస్ బియ్యం వ్యవహారం కూడా ఉంది.
ఇప్పటికే ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న వైసీపీ నేతల్ని కలుగులోంచి బయటకు లాక్కురావడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం వెనుక ఉన్న మూలవిరాట్టులందరికీ వణుకు మొదలైంది. కాగా.. బొత్స సత్యానారాయణ మీకు చిత్తశుద్ధి ఉంటే, చేతనమైతే విచారణ చేయించి అసలు దోషులను తేల్చండి అంటూ పవన్ కల్యాణ్ కు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. తప్పుడు పనిచేస్తున్నది, ఆ స్మగ్లింగ్ వెనుకనుంచి నడిపిస్తున్నది తమ పార్టీ వారే కాగా, చేతనైతే అరెస్టులు చేయండి అంటూ బొత్స సత్యనారాయణ దూకుడుగా మాట్లాడడం అనేది తమ పార్టీ వారికే చేటు చేస్తుందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తమ్ముడి కి చెందిన సంస్థ ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఆరోపించారు. నిజానికి బియ్యం స్మగ్లింగ్ ద్వారా.. ద్వారంపూడి వేల కోట్లు ఆర్జిస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ ఎన్నికలకంటె ముందునుంచే ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానంగా ఈ అంశాన్నే వాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు.. బొత్స మాటల్ని గమనిస్తే.. ద్వారంపూడి ఫ్యామిలీని ఇరికించడానికే బొత్స అలా మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు కూడా పలువురికి కలుగుతున్నాయి.
ఇటీవల శాసనమండలిలో చర్చ సందర్భంగా కూడా.. వైసీపీ వారు పాల్పడిన నేరానికి సంబంధించి ఒక చర్చ జరిగింది. ఆ సమయంలో కూడా బొత్స సత్యనారాయణ ఇదే తరహా దూకుడు ప్రదర్శించారు. చేతనైతే విచారణ జరిపి వారిని అరెస్టు చేసుకోండి అంటూ రెచ్చిపోయారు.
ఆ కేసులో అయినా, ఇప్పుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ కేసులో అయినా విచారణలు జరగుతున్నాయి. దొంగల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతారు. తమ పార్టీ వారిని వీలైనంత తొందరగా అరెస్టు చేయించడానికే బొత్స ఈ సవాళ్లు విసురుతున్నారని పలువురు అంటున్నారు.