రజనిపై కేసు పెట్టలేదని భూమన బాధపడుతున్నారా?

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని సినీకవి ప్రవచనం చెప్పారు గానీ.. నిజానికి రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని మనకు అనుభవంలో అర్థమవుతుంది. అలాంటి నేపథ్యంలో.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తాజాగా అంటున్న మాటలను గమనిస్తే.. మాజీ మంత్రి విడదల రజని మీద పోలీసులు కేసు పెట్టలేదని ఆయన బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి జమానాలో జరిగిన అక్రమాలు, పాపాల చిట్టాను కూటమి ప్రభుత్వం తవ్వుతుండడం వల్ల.. ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తున్నాయి. వైసీపీ కీలక నాయకుల్లో దాదాపుగా అందరి మీద మల్టిపుల్ కేసులు నమోదు అవుతున్నాయి. విడదల రజని మీద ఇప్పటికే ముడుపుల కేసు ఒకటి నడుస్తుండగా.. మరో కీలకకేసు పెట్టకుండా పోలీసులు వదిలేశారే.. అని ఆవేదన చెందుతూ.. ఇంకో రకంగా భూమన మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
ఇంతకూ ఏం జరిగిందంటే.. విడదల రజని పీఏ మానుకొండ శ్రీకాంత్ రెడ్డి.. ఆమె అధికారంలో ఉన్న సమయంలో అనేక దందాలకు, అక్రమాలకు కేంద్రబిందువుగా ఉన్నాడు. వీటిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో అందజేసే కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ తన వద్ద 28 లక్షల రూపాయలు తీసుకుని మోసగించినట్టుగా చిలకలూరి పేటకు చెందిన మున్నంగి రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో విచారించడానికి మానుకొండ శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు రెండుసార్లు 41ఏ నోటీసులు  ఇచ్చినా ఆయన స్పందించలేదు సరికదా.. వారికి దొరక్కుండా పరారయ్యారు. ఈనేపథ్యంలో రజినితో కలిసి మానుకొండ శ్రీకాంత్ రెడ్డి కూడా ఒక కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి.. పోలీసులు ఆమె వాహనాన్ని ఆపారు.

దీంతో విడదల రజని ఒక్కసారిగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిందులు తొక్కారు. శ్రీకాంత్ రెడ్డి తన కారులో లేనే లేడని బుకాయించడానికి ప్రయత్నించారు. అతడిని కారులోనే దాచిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు పట్టుబట్టడంతో చివరికి మానుకొండ శ్రీకాంత్ రెడ్డి కారులోనే ఉన్నట్టు ఒప్పుకున్న విడదల రజని.. వారు అరెస్టు చేయబోగా.. తన కారులోనే స్టేషనుకు తీసుకువచ్చి అప్పగిస్తానని మొండికేశారు. చివరికి పోలీసులు ఒప్పుకున్న తర్వాత.. తన కారులో స్టేషను వద్ద విడిచిపెట్టి వెళ్లారు.

నిజానికి పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు వారు విడదల రజని మీద కూడా కేసు నమోదు చేసి ఉండాలి. నిందితుడిని దాచిపెట్టినందుకు, రక్షణ కల్పించినందుకు కూడా మరో కేసు పెట్టి ఉండాలి. అయితే పోలీసులు రజని పట్ల సానుభూతితో వ్యవహరించారు. ఈ కేసులు ఆమె మీద నమోదు చేయకుండా విడిచిపెట్టారు. ఇది భూమనకు, మరికొందరు వైసీపీ నాయకులకు కడుపు మంటగా ఉన్నట్టుంది. విడదల రజని పట్ల సీఐ ప్రవర్తన దుర్మార్గంగా ఉన్నదంటూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు భూమన. ఈ నాయకుల మాటలు పైకి చూడడానికి రజనికి మద్దతుగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తున్నాయి గానీ.. లోలోన ఆమె మీద ఈ కేసులు పెట్టలేదే అని వారు మధనపడుతున్నట్టుగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories