తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక వచ్చిన ఫలితం ఆ తరువాత పరిణామాలు అనేక రకాల కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. వీటిలో ఒకానొక ప్రధాన సందేహం భూమన కరుణాకర్ రెడ్డి బెదిరింపులకు– పార్టీ మారిన కార్పొరేటర్లు మరీ అంతగా జడుసుకుంటున్నారా? అనేది! ఎందుకంటే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక ముగిసిన తర్వాత వైసీపీని విడిచిపెట్టి తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేసిన కార్పొరేటర్ లు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి– తండ్రీ కొడుకుల కాళ్లు పట్టుకొని ‘తప్పైపోయింది క్షమించండి’ అని వేడుకోవడం అనేక అనుమానాలను కలిగిస్తున్నది. రాచరికవ్యవస్థను తలపిస్తున్నది. భూముల తండ్రి కొడుకులు తమను ఏం చేసేస్తారో అనే భయం ఎంతగా లేకపోతే.. వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకునే పరిస్థితి దాపురిస్తుంది అని పలువురు అంచనా వేస్తున్నారు.
వైసిపి కార్పొరేటర్లు తెలుగుదేశం లో చేరడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక భవిష్యత్తు లేదు అనే అభిప్రాయానికి రావడం వల్లనే ఏకంగా 26 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పంచన చేరారు. వీరిలో చివరిగా వెళ్ళిన నలుగురిని మభ్య పెట్టేందుకు భూమనఅభినయ రెడ్డి, కరుణాకర్ రెడ్డి చాలా ప్రయత్నించారు. పార్టీలో నెంబర్ టు గా ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి లాంటి వాడే రాజీనామా చేసి వెళ్ళిపోయాక.. ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఎవరు మాత్రం నమ్ముతారు? అందుకే వారు పట్టించుకోలేదు. ఫలితం టిడిపి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయరుగా గెలిచారు.
ఆ తదనంతర పరిణామాలు భూముల తండ్రి కొడుకుల పట్ల ఆ కార్పొరేటర్ లలో ఉన్న భయాన్ని సూచిస్తున్నాయి. తాము ఎన్ని చెప్పినా సరే వినకుండా తెలుగుదేశానికి ఓటు వేసిన వారి అంతు చూస్తామని భూమన తండ్రి కొడుకులు తమ వర్గీయుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే వాళ్లు ఓటింగ్ తర్వాత భయపడి నేరుగా భూమన ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. తమను చంపేస్తారేమో అనే భయంతోనే అనీష్ రాయల్ అనే కార్పొరేటర్ అభినయ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల కాళ్ళ మీద పడి ఏడుస్తూ, వేడుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. తన కాళ్ళ మీద పడుతున్నప్పుడు కరుణాకర్ రెడ్డి కాస్త అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ, అభినయ్ అదికూడా పట్టించుకోలేదు. తన కాళ్ళ మీద పడితే పడనివ్వండి ఆ వీడియో రాష్ట్రమంతా చూడాలి అన్నట్టుగా చాలా నింపాదిగా వ్యవహరించారు. చూడబోతే కాళ్ళ మీద పడి వేడుకుంటే తప్ప వారి బారి నుంచి తప్పించుకోలేం అని భయపడే స్థాయిలో ఆ నలుగురు కార్పొరేటర్లకు భూమన ఫ్యామిలీ బెదిరింపులు ఉన్నాయని అనుకోవాల్సి వస్తుంది.
అసలే ఓడిపోయిన పార్టీ, భవిష్యత్తులో ఉంటుందో లేదో అర్థం కాని పార్టీ.. అలాంటి పార్టీ తరఫున వీరు ఇంతటి దాదాగిరీ, దౌర్జన్యం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు!