ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అరాచకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నాయకులకు పోలీసుల సహకారం మితిమీరి ఉంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట తెలుగుదేశం నాయకులను అడ్డుకోవడం, జనసేన నాయకులు మీద అక్రమ కేసులు బనాయించడం అతి తరచుగా జరుగుతూ ఉన్నది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి దురాగతాలకు పాల్పడినా కేసులు నమోదు కావడం లేదని, నగదు ప్రలోభాలకు తాయిలాలు ఇలాంటివి ఎన్ని పట్టుబడినా చూసీచూడనట్టు పోతున్నారని అదే ఎన్డీయే కూటమి విషయంలో వేధిస్తున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ రకంగా.. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార సరళి పూర్తిగా దారితప్పిపోయి, అధికారి పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పనితీరు పరంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా, వ్యవస్థలు మొత్తం ఎన్నికల సంఘం పరిధిలో నిష్పాక్షికంగా పనిచేయాల్సి ఉన్నా.. అలాంటి ఆనవాళ్లు ఏపీలో కనిపించడం లేదు. ప్రతిరోజూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఒక్కటొక్కటిగా ఈసీ అధికారులు పరిశీలిస్తున్నారు. వారి సంజాయిషీలను బట్టి నివేదికలకు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. రాష్ట్రంలో రెండు జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురికావడం కూడా జరిగింది. ఆ రెండు జిల్లాలతో పాటు తెలుగుదేశం కార్యకర్త కారును తగులబెట్టిన మరో జిల్లా ఎస్పీని కూడా పిలిపించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణలు తీసుకున్నారు.
ప్రస్తుతానికి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇద్దరు ఎస్పీల మీద వేటు పడవచ్చునని తెలుస్తోంది. పలువురు సీఐలు, డీఎస్పీల మీద కూడా తెలుగుదేశం ఫిర్యాదులు చేసిఉంది. వారిలో కూడా కొందరిపై వేటు పడవచ్చు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు నిష్పాక్షికంగా, మొత్తం రాష్ట్రంలో ఏకరీతిగా ఉండాలంటే.. ఇలాంటి చిన్న చేపలపై వేసే వేటు సరిపోతుందా? అనే సందేహం పలువురిలో వ్యక్తం అవుతోంది.
రాష్ట్ర డీజీపీని తక్షణం మార్చాలని, లేకపోతే ఎన్నికలు మంచి వాతావరణంలో జరగవు అని ఆల్రెడీ విపక్ష నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరి.. ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిష్పాక్షికమైన వాతావరణం ఉండాలంటే.. ఎలాంటి తీవ్ర నిర్ణయాలకు వెళుతుందో గమనించాలి.