ఏపీ రాష్ట్రమంత్రి టీజీ భరత్ తాజాగా ఒక సరికొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలంటే.. జగన్ మీడియాను బహిష్కరించాలనే మాట అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రంలాగా నడుస్తున్న సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానెల్ లను ఏపీలో ప్రసారం కాకుండా కట్టడి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన వాదన ఏంటంటే.. మహిళలపై వైసీపీ నాయకులు నీచమైన వ్యాఖ్యలు చేసినా సరే.. వాటిని సమర్థించుకుంటూ సాక్షి టీవీ ఛానెల్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది చాలా బాధకరమని అంటూ వీటిని ప్రజలే బహిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపు ఇచ్చారు.
అయితే ఇలా పత్రికల మీద ఆంక్షలు విధించడం, టీవీ ఛానెళ్లను ప్రసారం కానివ్వకుండా బ్యాన్ పెట్టడం వంటి దుర్మార్గమైన పరిణామాలు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మొదలయ్యాయి. ప్రభుత్వం తప్పుడు పోకడలను నిలదీస్తున్నందుకు ఈటీవీ, ఆంధ్రజ్యోతి ఛానెళ్లు రాష్ట్రంలో ఎక్కడా ప్రసారం కాకుండా చేయించిన ఘనత ఆయనది. ఆ రెండు పత్రికలకు సంబంధించిన రిపోర్టర్లను ప్రభుత్వ కార్యక్రమాల రిపోర్టింగుకు కూడా రానివ్వకుండా ఆయన తన సంకుచితత్వాన్ని ప్రదర్శించేవారు. కానీ.. ఆ తర్వాత చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత.. సాక్షి మీడియా తప్ప మరెవ్వరితోనూ విభేదాలు లేవు. సాక్షి కూడా అచ్చమైన కరపత్రికలాగా వ్యవహరిస్తున్నందువల్ల మాత్రమే వారితో విభేదాలు! అయినా కూడా నిషేధాలు మాత్రం లేవు.
ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో టీజీ భరత్ చెబుతున్నట్టుగా.. మహిళల గురించి అవమానకరంగా, నీచంగా, తమ లేకిబుద్ధులను బయటపెట్టుకునేలాగా మాట్లాడడం ఒక ఎత్తు అయితే.. వాటిని సమర్థించుకుంటూ మరింత నీచంగా చర్చలు నిర్వహించడం మరొక ఎత్తు. ఇంత జరుగుతున్నా సరే.. సాక్షి చానెల్ రాకుండా చేయడం వంటి ఆంక్షలకు ప్రభుత్వం ఉపక్రమించడం లేదు.
టీజీ భరత్ తన మాటల్లో.. ప్రజలైనా సరే స్వచ్ఛందంగా ఆ పత్రిక చానెళ్లను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు గానీ.. ఆ పని ఎప్పుడో జరిగిపోయింది. రోజులో 24 గంటలపాటు జగన్మోహన్ రెడ్డిని భజన చేయడానికి, చంద్రబాబునాయుడు మీద విషం కక్కడానికి సాక్షి చానెల్ శతవిథాల ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆ చానెల్ ను చూసే వాళ్లు ఉన్నారా? అనేది సామాన్య ప్రజల సందేహం. సాక్షి చానెల్ ను కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు మాత్రమే చూస్తుంటారు.
ఆ చానెల్లో ఎలాంటి వాదనలు తమ నాయకులు వినిపిస్తున్నారో చూసి, జాగ్రత్తగా నేర్చుకుని.. ఊరిమీద అందరితోనూ ఆ వాదన స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అంతే తప్ప సామాన్యులు ఆ చానెల్ చూసి ప్రభావితం కావడం అంటూ ఉండదు. జగన్ చానెళ్లు ప్రతి విషయాన్ని వంకరగా ప్రొజెక్టు చేస్తుండగా వాటి క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది. ఏదో నామమాత్రంగా జగన్ భజనకు ఒక బృందంలాగా పనిచేయాల్సిందే తప్ప.. మరొకటి కాదు. ఇలాంటి సమయంలో నిషేధాలు విధించడం కూడా అనవసరం అని ప్రజలు అనుకుంటున్నారు.