మా రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు, కంపెనీలు మా రాష్ట్ర వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి .. అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వాదిస్తే ఎలా ఉంటుంది? చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది కదా.? ఇప్పుడు అదే పరిస్థితి కర్ణాటకలో ఏర్పడింది. కర్ణాటకలోని కంపెనీల్లో గ్రూపు సి, డి లకు చెందిన ఉద్యోగాలు నూటికి నూరుశాతం కన్నడిగులకే మాత్రమే కేటాయించాలంటూ.. సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేసి ఒక వివాదానికి తెరలేపారు. దీని మీద చాలా రాద్ధాంతమే జరిగింది. ఆ తరువాత సిద్ధరామయ్య కాస్త వెనక్కు తగ్గి మేనేజిమెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్ కోటాలో 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కేబినెట్ తీర్మానం కూడా చేశారు. ఈ ప్రతిపాదన మీద కూడా పెద్దస్థాయిలో దుమారం రేగింది. రాష్ట్రంలోని యువతరానికి మేలు చేయాలని అనుకోవడం కరక్టే గానీ.. అది చేయాల్సింది ఇలాంటి నిబంధనల ద్వారా కాదని విమర్శలు వెల్లువెత్తాయి. కేబినెట్ నిర్ణయం జరిగినప్పటికీ.. బిల్లును ప్రస్తుతానికి శాసనసభలో పెట్టకుండా ఆగాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
కాగా, సిద్ధరామయ్య నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇది పూర్తిగా అసంబద్ధమైన నిర్ణయం అంటున్నారు. దానికి బదులుగా.. మా రాష్ట్రంలో మా రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే పరిశ్రమలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి.. అనే నిబంధన సిద్ధరామయ్య తేవచ్చు కదా అంటున్నారు. అలా చెబితే.. ఆ రాష్ట్రం ఆర్థికంగా ఎంత సర్వనాశనం అయిపోతుందో.. ఉద్యోగాల విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు. కావలిస్తే.. ప్రభుత్వం నిర్ణయించిన శాతాల మేరకు ఉద్యోగాల కల్పన చేసే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించవచ్చునని.. తద్వారా రాష్ట్ర యువతరానికి మేలు జరుగుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సిద్ధరామయ్య నిర్ణయం కారణంగా జరుగుతున్న చర్చ, ఏర్పడిన అనిశ్చితి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగబోతోంది. ఇప్పటికే విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టాలని లోకేష్ నాస్కామ్ ను ఆహ్వానించారు. కర్ణాటకనుంచి ఏపీకి రీలొకేట్ కావాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఈ పరిణామాలను ఏపీలో పారిశ్రామిక పురోగతికి అనుకూలంగా వాడుకోవాలని లోకేష్ ప్రయత్నిస్తుండడం విశేషం.