కొసరు అవమానాలకు విశాఖలోనే శ్రీకారం!

జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అసలైన పెద్ద దెబ్బను రాష్ట్రంలోని ప్రజలందరూ కలిపి కొట్టారు. 151 సీట్లతో ఆదరించిన ప్రజలే.. కేవలం 11 సీట్లు చాలు అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. అసలు దెబ్బ రెండు నెలల కిందటే పడింది. ఇప్పుడిక జగన్మోహన్ రెడ్డి అహంకారానికి కొసరు దెబ్బలు పడడం మొదలైంది. స్థానికసంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఒక్కటొక్కటిగా కూటమి పార్టీల చేతుల్లోకి జారుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి కలల రాజధాని విశాఖపట్నం నుంచే ఆ పర్వానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. విశాఖలో ఏకంగా 12 మంది కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడి… కూటమి పార్టీల్లో చేరడం జరిగింది.
విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కు సంబంధించినంత వరకు వైసీపీలో ముసలం పుట్టి చాలాకాలమే అయింది. పాతిక మంది వరకు కార్పొరేటర్లు పార్టీ  మారే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. అయితే వైసీపీ నాయకులు రంగంలోకి దిగి నష్టనివారణ చేయాలని చూశారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు ఫోన్లలో మాట్లాడారు. ప్రయోజనం ఉండదని గ్రహించి మిన్నకుండిపోయారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కార్పొరేటర్లు అందరితో సమావేశం పెట్టుకున్నారు గానీ.. 16 మంది గైర్హాజరు అయినప్పుడే.. ఫిరాయింపులు ఖరారయ్యాయి. ఆయన మంతనాలు, బుజ్జగింపులు, వారికి చూపించిన ప్రలోభాలు ఏవీ ఫలించలేదు. తీరా ఆయన మీటింగు పెట్టి రెండు రోజులు కూడా గడవకముందే.. 12 మంది కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఏడుగురు తెలుగుదేశంలోను, ఐదుగురు జనసేనలోనూ చేరడం విశేషం. ఇంకా పలువురి చేరిక త్వరలోనే ఉంటుందని తెదేపా నాయకులు అంటున్నారు.

కానీ జీవీఎంసీలో ఇప్పటికే బలాబలాలు దారుణంగా మారిపోయాయి. 97 మంది కార్పొరేటర్లుండగా.. తెలుగుదేశం కూటమి బలం 45కు పెరిగింది. వైసీపీ చేతిలో 50 స్థానాలున్నాయి. సీపీఐ, సీపీఎం తరఫున చెరొక కార్పొరేటర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకో ముగ్గురు వైసీపీ నుంచి ఇటు మారినా సరే.. అక్కడితో లాంఛన మెజారిటీ పూర్తవుతుంది. ఆ పర్వం ఒకటిరెండు రోజుల్లో జరుగుతుందని అంటున్నారు. ఆ రకంగా జగనమోహన్ రెడ్డి అహంకారానికి తొలి కొసరు దెబ్బ విశాఖలోనే పడబోతోంది.

ఇప్పటికే ఒంగోలు, పుంగనూరు వంటి మునిసిపాలిటీలో కూడా తెలుగుదేశం ఖాతాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ కార్పొరేటర్ల అధికారిక చేరికలు ఇంకా పెండింగులో ఉన్నాయి. బహుశా విశాఖ సమీకరణాలు మారిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలు కార్పొరేషన్లు వైసీపీ చేజారడం జరుగుతందని అంతా అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories