మహానాడు బదులుగా ఈ దఫా విజయోత్సవం!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతికి అన్న- నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు వేడుకలను ఈసారికి నిర్వహించడం లేదు. ఈ మేరకు పార్టీ వ్యూహ కమిటీలోని సీనియర్ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. సాధారణంగా.. మే 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆరోజున ముగింపు సభ ఉండేలాగా రెండు రోజులు లేదా మూడురోజుల పాటూ మహానాడు వేడుకలు జరుగుతుంటాయి. ఇప్పుడు పోలింగ్ పూర్తయి.. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఎదురుచూడాల్సి ఉన్నందున మహానాడును రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

అయితే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ ఏడాది మహానాడు కాకుండా, అధికారంలోకి వచ్చిన రెండునెలల్లోగా అత్యంత భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకను ఏదో ఒకరూపంలో నిర్వహించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. రాష్ట్రాన్ని ఏయే అభివృద్ధి ప్రాజెక్టుల దిశగా నడిపించే పనిలో ఉన్నారో.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక.. అదే అభివృద్ధి పనులకు పునరంకితం అవుతున్నామనే సంకేతాలు ఇవ్వడానికి తగిన రీతిలో భారీ స్థాయిలో విజయోత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు, దేశంలోని ముఖ్యులైన ఎన్డీయే కూటమి ప్రముఖులు అందరినీ కూడా ఆహ్వానించి అత్యంత అట్టహాసంగా, ఆర్భాటంగా నిర్వహించాలని చంద్రబాబు తలపోస్తున్నారట. కేవలం తమ విజయాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి, ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలకు కూడా ఇలాంటి వేడుక ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఈ విజయోత్సవ వేడుక జులై లేదా ఆగస్టు నెలల్లో ఉండవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆగస్టు నెలలోనే గనుక ఇలాంటి విజయోత్సవాన్ని నిర్వహిస్తే.. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం అనే గండం పొంచి ఉంటుందని వ్యాఖ్యానించే విమర్శకుల నోళ్లకు కూడా తాళం వేసినట్టు అవుతుందని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories