ఏపీకి పరిశ్రమల వెల్లువ : అలుపెరగని ప్రయత్నాల్లో లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చేందుకు బృహత్ ప్రయత్నం సాగుతోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోని అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులకు మళ్లీ ముందుకు రావడం మొదలైన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. కొన్నిరోజుల కిందట చంద్రబాబు ప్రకటించిన ఆరు ప్రభుత్వ పాలసీల్లో భాగంగా పారిశ్రామిక పాలసీని కూడా ప్రకటించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎన్నో వరాలను ప్రకటిస్తూ ఆ పాలసీని రూపొందించారు. నూతన పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉన్నదని సీఐఐ ఏపీఛైర్మన్ మురళీకృష్ణ కూడా కితాబివ్వడం ప్రజలకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పరిశ్రమలు వెల్లువలా ఏపీకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరిన్ని రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్  సోమవారం ఎలక్ట్రానిక్స్ తయారీదార్లతో సమావేశం కాబోతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆయా కంపెనీలను ఆహ్వానించనున్నారు.

పారిశ్రామిక రంగం పరంగా ఏపీ గత అయిదేళ్లు జగన్ పరిపాలన కాలంలో ఎంతగా సర్వనాశనం అయిపోయిందో అందరికీ తెలుసు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురాలేని జగన్, ఉపాధి అవకాశాల పరంగా యువతరం భవిష్యత్తును నాశనం చేశారు. ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొట్టారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వారిని వాటాలకోసం బెదిరించి పారిపోయేలా చేశారు. పరిశ్రమల పరంగా ఇంతటి అరాచకత్వాన్ని రాష్ట్రం చవిచూసింది. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
కొన్నాళ్ల కిదంట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీసిటీ సెజ్ లో కొన్ని కొత్త పరిశ్రమలను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయనతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా వెళ్లారు. అయితే ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవాల్లోనూ, ఇతర వేడుకల్లోనూ పాల్గొంటూ ఉండగా.. మరోవైపు నారా లోకేష్ మాత్రం అక్కడి పరిశ్రమలకు చెందిన అధిపతులతో.. కొత్త పరిశ్రమల స్థాపన, కొత్త యూనిట్ల స్థాపన, కొత్తగా కల్పించగల ఉద్యోగావకాశాల గురించి చర్చిస్తూ గడిపారు.

అలాగే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ ఆదివారం నాడు అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సుమారు 40 నిమిషాలు పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కొన్ని పథకాలకు అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కావాలని కోరారు. అదే సమయంలో ఢిల్లీలో సోమవారం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి దారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉన్నదని.. పెట్టుబడులకు ముందుకు రావాలని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన వారితో చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. ఆ రకంగా రాబోయే అయిదేళ్లలో మారబోయే ఏపీ పారిశ్రామిక ముఖచిత్రంలో తన భాగస్వామ్యం కూడా ఉండేలా లోకేష్ కష్టపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories