విజయసాయిరెడ్డి ఇప్పుడు స్వతంత్రంగా మాట్లాడగల స్థితిలో ఉన్నారు. తాను ఏం చెప్పదలచుకుంటే అదే చెప్పగల స్థితిలో ఉన్నారు. ఎవ్వరి అధీనంలోనూ ఉన్న మనిషి కాదు. ఎవ్వరి ముఖప్రీతికోసం.. అధిష్ఠానం కళ్లలో వెలుగులు చూడడం కోసం మాట్లాడవలసిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా తనకు దక్కిన రాజకీయ వైభవ స్థితి ఎంపీ పదవికి, వీటన్నింటినీ మించి.. జగన్మోహన్ రెడ్డితో సాంగత్యానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఆ స్వేచ్ఛ కారణంగానే కావచ్చు.. కాకినాడ సీపోర్టు వాటాలు దక్కించుకోవడంలో సాగించిన దందాలకు సంబంధించి ఆయన సీఐడీ విచారణలో చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలు కేవలం ఆయన ప్రస్తావించిన పేరుగల ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు. ఆయన వెనుక ఉన్న ప్రముఖుల్ని, జగన్ సహా అందరినీ ఇరికించేలా కనిపిస్తున్నాయి.
కాకినాడ సీ పోర్టు వాటాలను కేవీ రావును బెదిరించి దక్కించుకున్నారనేది ఇప్పుడు విచారణ జరుగుతున్న కేసు. దీనికోసం విజయసాయిరెడ్డి- కేవీరావుకు ఫోనుచేసి బెదిరించారనేది ఆరోపణ. దీనిపై విచారణ సంస్థ సీఐడీ ఆయనకు నోటీసులు ఇచ్చి పిలిచింది. ప్రస్తుతం ఎంపీ పదవి కూడా లేని విజయసాయిరెడ్డి ఒక సాధారణ వ్యక్తిగా విచారణకు హాజరయ్యారు. అయితే.. కాకినాడ పోర్టులో వ్యాపారం గురించి తనకేమీ తెలియదని, తాను కేవీరావుతో ఎన్నడూ మాట్లాడను కూడా లేదని చెబుతున్న విజయసాయి.. ఒక్కసారి జగన్ అవినీతికేసుల్లో తనను ఏ2గా చేర్చిన తర్వాత.. ‘ఏ2’ అనే పదాన్ని తనకు ముడిపెట్టేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
అయితే, కాకినాడ పోర్టు వాటాల విషయంలో ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డికూడా ఒక నిందితుడు. అల్లుడి వ్యాపారాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని, కుటుంబ సంబంధాలకే విలువ ఇస్తానని, కనీసం అల్లుడి సంస్థల్లో ఉద్యోగం కూడా ఎవరికీ సిఫారసు అడగనని చెప్పుకొచ్చిన విజయసాయి.. కేవీరావుకు- శరత్ చంద్రకు మధ్య డీల్ చేయడంలో కర్త కర్మ క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డి మాత్రమే అని సీఐడీకి చెప్పడం గమనార్హం.
విక్రాంత్ రెడ్డి అంటే ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు. వైవీసుబ్బారెడ్డి.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుంగు మార్గదర్శకుడు. జగన్ తర్వాత పార్టీలో కీలకంగా చక్రం తిప్పుతున్న కీలక నేతల్లో ఒకరు! జగన్ ను తప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా.. అని సీఐడీ అడిగినప్పుడు.. అంతా విక్రాంత్ రెడ్డే సూత్రధారి అని చెప్పడం ద్వారా.. విజయసాయి పరోక్షంగా జగన్ ను, వైవీ సుబ్బారెడ్డిని కూడా ఇరికించేసినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయసాయిని మళ్లీ సీఐడీ విచారణకు పిలుస్తుందో లేదో తెలియదు గానీ.. మొత్తానికి ఆయన విచారణ పర్వం వైసీపీలోని చాలా మంది పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నదని అంతా అనుకుంటున్నారు.