చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో కూడా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాధగా ఏర్పడినప్పుడు కూడా ఆయన మీద నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలందరూ అధికారాన్ని అప్పగించారు. అయితే అప్పుడెప్పుడూ లేనిది ఇప్పుడు మాత్రమే నూతన అధ్యాయానికి శ్రీకారం ఎలా అవుతుంది? అనే అభిప్రాయం, అనుమానం పలువురికి కలగవచ్చు! కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రమాణస్వీకారం మాత్రమే రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం కచ్చితంగా అవుతుంది.
ఎందుకంటే… అవశేష ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడానికి చంద్రబాబు నాయుడు తన శక్తివంచన లేకుండా ఆహారహం పరిశ్రమించారు. అమరావతి రాజధానిని ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు తలతిప్పి చూసే విధంగా ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అయితే ఐదేళ్లలో ఆయన చేసిన కష్టాన్ని పలుచన చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సాగించిన దుష్ప్రచారం అప్పట్లో విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లలో ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసంవైపు వినాశనం వైపు నడిపించారో ప్రజలందరూ గుర్తించారు. రాష్ట్ర ప్రజలు తమ కలలాగా కోరుకున్న అమరావతి అనే రాజధానిని ఒక మరుభూమి లాగా జగన్మోహన్ రెడ్డి ఎలా మార్చివేశారో ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడుకు ప్రత్యామ్నాయంగా మరొకరిని ఎంచుకుంటే రాష్ట్రానికి ఎలాంటి దుర్గతి పడుతుందో ప్రజలు గ్రహించారు. అందుకే దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేని విధంగా 93% సీట్లను చంద్రబాబు నాయుడు సారథ్యం లోని తెలుగుదేశం కూటమికి ప్రజలు కట్టబెట్టి మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఇచ్చారు. అందుకే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వం, కార్యసామర్థ్యం మీద తమ అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్న శుభవేళ ఇప్పుడు చేస్తున్న ప్రమాణస్వీకారం మాత్రమే ప్రత్యేకమైనది. ఇది మాత్రమే కొత్త చరిత్రను లిఖించే.. సువర్ణ అధ్యాయాలను సృజించే… ప్రయత్నం అవుతుంది.
ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నారా చంద్రబాబునాయుడు కు తెలుగుమోపో డాట్ కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.