వారేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. కనీసం జగనన్న అందిస్తున్న పథకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్న లబ్ధిదారులు కూడా కాదు. అనాథలు. కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారానికి వారందరినీ మూకుమ్మడిగా తరలించింది. అనాథ బాలికలు అందరికీ వైసీపీ కండువాలు కప్పేసి, పార్టీ టోపీలు పెట్టేసి.. ఇంటింటికీ తిప్పించింది. జగనన్నకే ఓటు వేయమంటూ వారితో అభ్యర్థింపజేసింది.
గతిలేని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ సంపన్నులు, ఔదార్యం ఉన్న వారు..
అనాథశరణాలయాలకు తమకు తోచిన సాయం చేస్తుంటారు. అలాంటి దైన్యస్థితిలో ఉన్న వారిని ప్రచారానికి వాడుకోవాలనే ఆలోచన వైసీపీ నేతలకు ఎలా వచ్చిందో తెలియదు. కానీ ఎందుకు వాడుకున్నారంటే మాత్రం.. వారు అనాథలు గనుక.. వారి తరఫున ఎవ్వరూ అడగరు గనుక.. వారికి ‘ప్రచారం కూలీ’ ఇవ్వాల్సిన అవసరం లేదు గనుక.. అనే సమాధానాలు వస్తున్నాయి.
మామూలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు.. కిరాయి కూలీలను నియమించుకుని ఇంటింటి ప్రచారాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. కొన్ని గంటల ఎన్నికల ప్రచారానికి వస్తే చాలు.. వారికి రెండు మూడొందల రూపాయలు, బిర్యానీ పొట్లాలు, క్వార్టర్ బాటిళ్లు అన్నీ సప్లయి చేస్తున్నారు. ప్రతిరోజూ వారికి కొత్త పార్టీ కండువాలు, కొత్త టోపీలు,కొత్త జెండాలు అదనం. ఆర్భాటపు ప్రచారానికి అలవాటు పడిపోయిన తర్వాత.. వీరిమీద పెడుతున్న ఖర్చే అభ్యర్థులకు తడిసి మోపెడవుతోంది. ఆ ఖర్చును తప్పించుకోవాలని అనుకున్నారేమో.. నూజివీడు వైకీపా అభ్యర్థి అనాథ శరణాలయం పిల్లలను ప్రచారానికి తరలించారు. ఆ అనాథశరణాలయం.. తమ పార్టీకే చెందిన సర్పంచి భర్త నాగేశ్ బాబు నిర్వహిస్తుండడం వారికి కలిసి వచ్చింది.
నిజానికి ఇలాంటి అనాథశరణాలయాల్లో అక్రమాలు జరగకుండా ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వారి అనుమతి లేకుండా.. ఇలాంటి కిరాయి పనులకు అనాథ బాలికలను వాడుకోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ప్రజలు ఇలాంటి దిక్కుమాలిన పనులను ఈసడించుకుంటున్నారు.
ఈ రకమైన ప్రచారంపై జనసేన నాయకులు ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మరి వారు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.