వేటు పడే చివరి క్షణం వరకు జగన్ సేవలోనే..!

‘చివరి రక్తపు బిందువు వరకు..’ అనే పడికట్టు డైలాగు మనకు సినిమాల్లో నాటకీయంగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్ భక్త పోలీసు అధికారులు కూడా అచ్చంగా ఇదే తరహాలో పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం తమ మీద వేటు వేసే చివరి క్షణం వరకు.. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేయడానికే కంకణం కట్టుకుని పనిచేస్తాం- అని ప్రతిజ్ఞ చేసినట్టుగా వారు పనిచేస్తున్నారు. అందుకే కొన్ని గంటల వ్యవధిలో పోలింగ్ మొదలు కాబోతున్న సమయంలో కూడా.. పలుచోట్ల పోలీసు అధికార్ల మీద ఈసీ వేటు వేస్తున్నది. వారి మీద చర్యలకు ఉపక్రమిస్తున్నది!

ప్రత్యేకించి తిరుపతిలో ఏకంగా అయిదుగురు సీఐలను ఈసీ పోలింగుకు ఒక్కరోజు ముందుగా బదిలీచేయడం గమనించాల్సిన సంగతి. వీరందరూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, వాటిని ధ్రువీకరించుకున్న ఈసీ వారందరినీ బదిలీచేసి అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిందిగా పంపేసింది.

తిరుపతి వ్యవహారం బయటపడింది గానీ.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక నియోజకవర్గాల్లో కూడా పోలీసు అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్నారనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు గత అయిదేళ్లలో ప్రత్యేకించి పోలీసుశాఖలో డీజీపీ వంటి ఉన్నతాధికారుల పోస్టులనుంచి ఎస్ఐ పోస్టుల వరకు కూడా పూర్తిగా తమ పార్టీ పట్ల విధేయత, జగన్ పట్ల భక్తి ఉన్నవారిని మాత్రమే నియమించుకుంటూ వచ్చింది. ఎన్నికల అవసరాల నిమిత్తం కొన్ని నెలలుగా వీరవిధేయులను మాత్రమే కీలకస్థానాల్లో నియమిస్తూ వచ్చింది. తిరుపతి లాంటిచోట ఒక ఎస్పీని నియమించి, తమ పార్టీ నాయకుల మాట వినలేదనే కారణంగా కేవలం రోజుల వ్యవధిలోనే అక్కడినుంచి బదిలీచేసి మరొకచోటకు పంపిన చరిత్ర కూడా వైసీపీ ఖాతలో ఉంది. ఇంత దారుణంగా జగన్ భక్త పోలీసులే రాష్ట్రమంతా ఉన్నారు. వారిలో బరితెగించి బయటపడిన వారు మాత్రమే వేటుకు గురవుతున్నారని, చాలా మంది తెలివిగా చాపకింద నీరులాగా జగన్ పార్టీని గెలిపించడానికి తమ వంతు ‘పోలీసు సాయం’ అందిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. పోలింగ్ మొదలైన తర్వాత కూడా పోలీసుల ప్రవర్తన తేడాగా ఉన్నట్లయితే అప్పటికప్పుడు వారిని విధులనుంచి తప్పించి.. పోలింగ్ నాడు మిగిలిన సమయానికి పక్కన కూర్చోబెట్టేందుకు కూడా ఈసీ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories