ఆ విషయంలో రేవంత్ ది కూడా కేసీఆర్ బాటే!

ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా.. తమకు అనుకూల వాతావరణం సృష్టించుకోవడం.. అసలు సమస్యల మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించి తమకు ప్రజాదరణ సృష్టించుకోవడం అనేది రాజకీయ నాయకులు తరచుగా ఆచరించే టెక్నిక్కులు. ఈ విషయంలో ఒకరు ఎక్కువ- ఒకరు తక్కువ అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి! ఈ విషయంలో తెలంగాణ నాయకులు అందరూ ఒకే పద్ధతిలో సాగుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టడమే తన రాజకీయ జీవితానికి ఆలంబనగా మార్చుకుని ఎదిగారు. అయితే తెలంగాణ ఏర్పడి.. ప్రజల మధ్య విద్వేషాలు, ఉద్వేగాలు అన్నీ చల్లారిన తర్వాత కూడా ఇలాంటి తేనెతుట్టెను కదిపి కేసీఆర్ బాటలోనే తన మైలేజీ పెంచుకోవాలని రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చి.. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం ఇలాంటిదేనని పలువురు అనుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి గ్రాఫ్ ప్రస్తుతం తెలంగాణలో కాస్త తిరోగమనంలో ఉన్నదని పలువురి అంచనా. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన కాస్త మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ప్రకటించుకోవడం, కేసీఆర్ మీద రెచ్చిపోయిన విమర్శలతో విరుచుకుపడడం ఇవన్నీ కూడా ఆయన ప్రదర్శిస్తున్న గాంభీర్యానికి చిహ్నాలే అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే బిల్లు కూడా అసెంబ్లీ ఎదుటకు వచ్చింది.

అయినా.. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రాంతానికి చెందిన ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన వాడు కాదు. తెలుగు భాషకు సంబంధించి గౌరవం దక్కడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఆంధ్రలో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా మాట్లాడేది తెలుగే. ఆయన పుట్టిన ప్రాంతం నెల్లూరు అయినా సరే.. తెలుగు భాషకు చెందిన రెండు రాష్ట్రాల వ్యక్తిగానే ఆయనను చూడాలి. ఆ రకంగా తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం సంకుచితమైన చర్య అని పలువురు భావిస్తున్నారు. నిజానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇదే ఆలోచనతో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. సురవరం ప్రతాపరెడ్డికి గౌరవం కల్పించాలనుకుంటే.. పాలమూరు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టవచ్చుననే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో ఇలాంటి సున్నితమైన ప్రాంతీయ విభేదాలను, భావోద్వేగాలను రెచ్చగొడితే తన మనుగడ స్థిరంగా ఉంటుందనే ఆలోచనతో.. కేసీఆర్ తరహా వ్యూహాలతో సాగుతున్నారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories