‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరులోనే నకిలీ బుద్ధి ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరున్న పార్టీకి.. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే భ్రమ కల్పించేలాగా నకిలీ పేరుతో ప్రజల ఎదుటకు తీసుకువచ్చి.. రాజశేఖర రెడ్డి మీద ప్రజల్లో ఉండగల అభిమానాన్ని వక్రమార్గాల్లో క్యాష్ చేసుకుని లాభపడాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఆ పార్టీ పుట్టుకలోనే ‘నకిలీ’ అనే బుద్ధి ఉంది. అలాంటి పార్టీ ప్రజలు బాగా అలవాటు పడిన లిక్కర్ బ్రాండ్లకు నకిలీలు తయారుచేయించి.. వాటిని ప్రజలకు అంటగట్టడం ద్వారా తాము అనుచిత పద్ధతుల్లో లాభపడాలని చూడడంలో వింతేముంది అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో ప్రజలను దోచుకోవడానికి, విపరీతంగా పెంచేసిన పెద్ద ధరలకు అమ్మడం ద్వారా.. తమ సొంత బొక్కసాన్ని నింపుకోవడానికి జగన్ సర్కారు పెద్ద ప్లానే వేసింది. మద్యం అసలు బ్రాండ్ ధర సుమారుగా రూ.700 వరకు ఉంటే.. దానిని ఇమిటేట్ చేస్తూ సృష్టించిన నకిలీ బ్రాండ్ ధర రూ.1700 వరకు పెడుతూ ఒక్కో బాటిల్ మీద వెయ్యికి పైగా దోచుకోవడానికి ప్రయత్నించారు.
జగన్ పాలన కాలంలో.. ప్రజల్లో మద్యం తాగే అలవాటును మాన్పించడమే తన లక్ష్యం అని బూటకపు మాటలు చెబుతూ.. జగన్ తొలుత లిక్కర్ ధరలను విపరీతంగా పెంచేశారు. అదే క్రమంలో ప్రజలు అలవాటు పడిన లిక్కర్ బ్రాండ్లు అన్నింటినీ అసలు అందుబాటులో లేకుండా చేశారు. వాటి స్థానంలో తమకు వాటాలు ముడుపులుగా ఇవ్వడానికి సిద్ధపడిన మద్యం కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇస్తూ వరారి ద్వారా చవకబారు బ్రాండ్లను తయారుచేయించి వాటిని మాత్రమే అమ్మడం కొనసాగించారు. అయితే అమ్మకాలు అనుకున్నట్టుగా సాగలేదు.
తమ చవకబారు కొత్త బ్రాండ్లు మాత్రమే తెస్తే.. వాటిని ప్రజలు తాగడం లేదని.. ఈలెక్కన వ్యాపారం జరిగితే తాము అనుకున్న స్థాయిలో వేల కోట్లు దండుకోవడం కష్టం అని భావించిన జగన్ దళం పాపులర్ బ్రాండ్లకు నకిలీలు చేయడం మొదలుపెట్టారు. బ్యాగ్ పైపర్, హేవర్డ్స్ క్లాసిక్, హనీబీ, ఓల్డ్ మాంక్, ఆఫీసర్స్ చాయిస్, మేన్షన్ హౌస్ ఇలాంటి అనేక పాపులర్ బ్రాండ్ల పేర్లను తలపించేలా నకిలీలు తయారు చేశారు. తాము మెచ్చే బ్రాండ్లే అనే భ్రమలో వాటిని కొని సగటు లిక్కర్ ప్రియులు తమ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటూ వచ్చారు. ఆ నకిలీలను మాత్రమే అత్యధిక ధరలకు విక్రయిస్తూ జగన్ దళాలు ఎడాపెడా దోచుకున్నాయి.
అసలే నకిలీ బుద్ధులతో, నకిలీపేరుగానే పుట్టిన పార్టీ.. నకిలీ లిక్కర్ ను విక్రయించడంలో పెద్ద వింతేముందని ప్రజలు ఇప్పుడు, ఈ బాగోతం మొత్తం బయటపడిన తర్వాత, అనుకుంటున్నారు.