పార్టీని ప్రక్షాళన చేయడం అనే అందమైన మాటను ప్రయోగిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ప్రక్షాళన చేయడం అంటే మరేమీ కాదు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. బేరీజు వేయకుండా.. తనకు ఇష్టం వచ్చిన రీతిలో నచ్చని వారిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్లిపోవడం మాత్రమే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనలో తొలి అడుగు అన్నట్టుగా కదిరి మాజీ ఎమ్మెల్యే పి వెంకట సిద్ధారెడ్డిని సస్పెండ్ చేశారు. 2019లో గెలిచిన పీవీ సిద్ధారెడ్డి, 2024 ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదని అక్కసుతో తెలుగుదేశం అభ్యర్థికి సహకరించారనే ఆరోపణల మీద జగన్ వేటు వేశారు.
ఏదో ఒక మామూలు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు గనుక.. ఒకింత ఆరోపణలు వినిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వేటు వేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి- కుడి ఎడమ భుజాలుగా చలామణి అయ్యే అనేకమంది పెద్ద తలకాయలు.. తమకు కిట్టని అనేకమంది నాయకులు ఓడిపోవడానికి శక్తివంచన లేకుండా ఈ ఎన్నికల్లో పనిచేశారు. వారందరి మీద కూడా వేటు వేయగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా? అనే చర్చ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తోంది. గెలుపు మీద అపరిమితమైన అతి విశ్వాసం ఏర్పడడంతో.. 2024 ఎన్నికలకు పూర్వం.. మంత్రి పదవుల వద్ద తమకు పోటీ రాకూడదనే ఉద్దేశంతో ఒకరి వెనుక ఒకరు గోతుల తవ్వుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. కేవలం మంత్రి పదవులు మాత్రమే కాకుండా స్థానిక రాజకీయాలలో తమ పెద్దరికానికి అడ్డు వస్తున్నారని ఇతర అభ్యర్థులను ఓడించడానికి కుట్రలు చేసిన వారు, అందుకోసం నిధులు సరఫరా చేసిన వారు కూడా ఉన్నారు. వారందరి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డికి తెలియనివి ఏమీ కాదు. కానీ వారి మీద వీసమెత్తు చర్య తీసుకోగల ధైర్యం జగన్ కు లేదు అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరి నియోజకవర్గం పని వారు చూసుకోకుండా.. పక్క నియోజకవర్గాలలో గోతులు తవ్వడం మీద దృష్టి సారించినందు వల్లనే ఈసారి ఎన్నికల్లో మరీ ఘోరంగా 11 స్థానాలకు వైసీపీ పడిపోయిందని.. లేకపోతే తమకు ఉన్న ఓటు బ్యాంకుకు కనీసం 50 సీట్లు అయినా దక్కి ఉండేవని కొందరు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీలో అధినేత వద్ద ప్రాపకం లేని నాయకుల పట్ల కఠినంగా కత్తి ఝుళిపించగలరేమోగాని.. ఆయనకు భజన చేస్తూ ఆయనను మభ్యపెడుతూ పార్టీకి ద్రోహం చేసే వారిని గుర్తించలేకపోతున్నారనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది. మరి జగన్ నిజంగా తన పార్టీని కాపాడుకోదల్చుకుంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.