ఐఐఎం లో చదివిన వ్యక్తి సినీ దర్శకుడిగా మారితే ఆ సంగతి అందరినీ ఆశ్చర్యంలో పడేస్తుంది. అలాంటి ప్రయాణం చేసాడు సాత్విక్ అనే యువకుడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకి చెందిన ఇతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం నుంచి చదువు పూర్తి చేశాడు. సాధారణంగా ఐఐఎం నుంచి బయటపడినవాళ్లు కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాల్లో చేరేందుకు చూస్తారు. కానీ సాత్విక్ మాత్రం తన చిన్ననాటి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేసాడు.
సినిమాలంటే ఎంతో ఇష్టమున్న సాత్విక్, తన మేనేజ్మెంట్ పరిజ్ఞానాన్ని సినిమాల రూపంలో వినియోగించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాడు. కథలు చెప్పడమే కాదు, ఒక సినిమా ఎలా ఉండాలన్న దానిపై స్పష్టమైన దృష్టికోణం ఉన్న ఇతను, ఓ దర్శకుడిగా తన దారిని ఏర్పరచుకున్నాడు.
ఇప్పుడు అతని దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా వైభవం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ విడుదలైన దగ్గరినుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో రుత్విక్, ఇక్రా ఇద్రిసితో పాటు మరికొందరు కొత్త నటులు కూడా నటించారు. కొత్తదనం కోరే ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.