లిక్కర్ కుంభకోణం మొత్తానికి మాస్టర్ మైండ్ గా వ్యవహరిస్తూ పాల్పడిన పాపాలే, చేసిన వసూళ్లు, దందాలే ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జైలు పాల్జేశాయి. అయితే ప్రస్తుతానికి ఆయన ఎంపీగా, ప్రజాప్రతినిధిగా పదవిలో ఉన్నారు గనుక.. తనకు జైలులో సైతం రాజభోగాలు కావాలని ఆయన అడిగారు. ప్రజాప్రతినిధి కదా అనే ఉద్దేశంతో కోర్టు కూడా అందుకు అనుమతించింది. మొత్తానికి కొత్తమంచం, కొత్త పరుపు, కొత్తదిండు లాంటి వాటితో సహా ఇంటిభోజనం, టేబులు కుర్చీ రాసుకోడానికి కాగితాలు, పేనాలు లాంటి అన్ని సదుపాయాలను మిథున్ రెడ్డి పొందారు. అయితే ఆయన గొంతెమ్మ కోరికలలోని ఒకదానికి మాత్రం బ్రేక్ పడేలా కనిపిస్తోంది. తనకు జైలులో కూడా సేవలు చేయడానికి ఒక సహాయకుడు కావాలని ఆయన కోరగా.. జైలు మాన్యువల్ లోనే అలాంటి పదం లేనేలేదని, సహాయకుడిని ప్రొవైడ్ చేయడం ఏ రకంగా సాధ్యమవుతుందని తన సందేహాలను వ్యక్తంచేస్తూ జైలు సూపరింటెండెంటు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.
అయినా.. యువకుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. తన పనులు తాను చేసుకోలేని ముదుసలి లాగా.. జైలు లో కూడా తనకు సహాయకుడు కావాలని అడగడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇంతా కలిపి మిథున్ర రెడ్డి వయసు కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసు.. బహుశా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు ఆయన వయసు కంటె కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ.. అప్పట్లో జగన్ కూడా జైలులో తనకు సహాయకుడు కావాలని పిటిషన్ వేయలేదు. కానీ.. 47ఏళ్లకే ముసలి ఫీలింగుతో బతుకుతున్నట్టుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహాయకుడు కావాలని అడగడం చిత్రంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
జైలు మాన్యువల్ లో సహాయకుడు అనే పదం లేనేలేదని, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, తమ పనులు తాము చేసుకోలేని వాళ్లు, వృద్ధులకు మాత్రం జైలులోని ఆరోగ్య సిబ్బందిని వారి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయడానికి వీలుంటుందని సూపరింటెండెంటు రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబునాయుడును ఇదే రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయనకు సహాయకుడిని ఏర్పాటుచేశారు. కానీ చంద్రబాబు వయసు అప్పటికే దాదాపుగా 75 ఏళ్లు. ఆయన వివిధ ఆరోగ్య సమస్యల రీత్యా నిత్యం క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటూ ఉండాలి. ఆ విషయంలో తోడ్పాటు అందించడానికే సహాయకుడిని ఏర్పాటుచేశారు.
కేవలం 47 ఏళ్ల వయసున్న యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ఏ ప్రాతిపదికన, ఏ అవసరం కోసం తనకు సహాయకుడు కావాలని అడుగుతున్నారో తెలియదు. అన్ని వసతులూ సమకూర్చిన హైకోర్టు బహుశా ఈ సహాయకుడి విషయంలో ఆయన విజ్ఞప్తిని నిబందనల ప్రకారం తిరస్కరించవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.