పదవులు కావాలంటే.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పొన్నెకల్లులో తాడికొండ నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ వేదిక మీదినుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అందవలసిన సందేశాన్ని ఆయన చాలా ఘాటుగానే అందజేశారు. పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ.. పదవులు ఆశిస్తున్న వారు ఏంచేయాలో చాలా స్పస్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు కార్యకర్తల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి, 50 శాతానికి పైగా ప్రజామోదం ఉన్న వారికి మాత్రమే పదవులు దక్కుతాయని ఆయన సెలవిచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఈ నియమం తనకు కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పడం ద్వారా.. ఈ నిబంధనపై కార్యకర్తలు ఎవ్వరూ నోరుమెదపని పరిస్థితిని కల్పించారు. ఈరకమైన ప్రకటనద్వారా… పార్టీ నాయకుల్లో పదవులు కోరుకునే వారు కష్టపడి పనిచేసే తీరాలనే సంకేతాలను చంద్రబాబు పంపారని అంతటా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇంకా అనేకం పెండింగులోనే ఉన్నాయి. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. పార్టీకోసం పనిచేశాం అని చెప్పుకునే వారు.. ఈ రెండు రకాల పదవుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. అయితే.. పార్టీ అగ్రనాయకులతో సత్సంబంధాలు ఉండడం, నాయకులు గెలవడానికి డబ్బులు విరాళాలు ఇచ్చాం.. లాంటి అంశాలను ప్రచారం చేసుకుంటూ పలువురు నామినేటెడ్ పదవులకోసం, పార్టీ పదవుల కోసం పైరవీలు చేసుకోవడం అనేది చాలా మామూలు విషయంగా మారింది. కానీ చంద్రబాబునాయుడు పొన్నెకల్లులో ప్రకటించిన నియమం ద్వారా.. పదవులు కోరుకునే ఏ ఒక్కరైనా సరే.. అటు ప్రజలతోను, ఇటు పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలతోనూ నిత్యం మమేకం అవుతూ పనిచేయాల్సిందే అని అనుకుంటున్నారు.

సాధారణంగానే కొందరు నాయకుల తీరు చిత్రంగా ఉంటుంది. పార్టీలో అగ్ర నాయకులతో సత్సంబంధాలను కలిగిఉంటారు. పార్టీ పట్ల ప్రేమతోనే ఉంటారు. కానీ క్షేత్రస్థాయి నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. నిత్యం ప్రభుత్వంలో తమ కార్యాలు చక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు. అలాంటివారికి ఇవి రోజులు కావని చంద్రబాబు మాటలతో స్పష్టత వచ్చినట్లయింది. ఐవీఆర్ఎస్ సర్వేలలో యాభైశాతం ప్రజామోదం, లేదా కార్యకర్తల ఆమోదం ఉండాలంటే చిన్న విషయం కాదు. నిత్యం ప్రతి ఒక్కరినీ పట్టించుకుంటూ, అందరి కష్టాలని ఆలకిస్తూ వారికి అండగా నిలిచే వారికి మాత్రమే ఈ లెక్కన పదవులు దక్కుతాయి. ఇది మంచి పరిణామం అని అంటున్నారు.

అలాగే రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు  33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని కూడా చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories